Telugu Global
Telangana

విదేశాల నుంచి కేటీఆర్ తిరిగొచ్చిన తర్వాత తొలి కార్యక్రమం ఇదే

ఆయన వెళ్లేముంది టికెట్ల ప్రకటన లేదు కాబట్టి పరిస్థితి ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు అక్కడక్కడా అసంతృప్తులతో ఉద్వేగంతో నిండి ఉంది. తిరుగు ప్రయాణంలో ఉన్న మంత్రి కేటీఆర్ ఇక్కడికి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొంటారు.

విదేశాల నుంచి కేటీఆర్ తిరిగొచ్చిన తర్వాత తొలి కార్యక్రమం ఇదే
X

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన వేళ మంత్రి కేటీఆర్ విదేశాల్లో ఉన్నారు. వ్యక్తిగత కార్యక్రమంతోపాటు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకుని భారత్ కి తిరిగొస్తున్నారాయన. అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా. ఆయన వెళ్లేముంది టికెట్ల ప్రకటన లేదు కాబట్టి పరిస్థితి ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు అక్కడక్కడా అసంతృప్తులతో ఉద్వేగంతో నిండి ఉంది. తిరుగు ప్రయాణంలో ఉన్న మంత్రి కేటీఆర్ ఇక్కడికి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొంటారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి ఆయన హాజరవుతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 70వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారు. సెప్టెంబర్-2న ఒకేసారి 11,700 ఇళ్లను పంపిణీ చేస్తారు. 24 నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు 9 ప్రాంతాల్లో ఇళ్లను కేటాయించారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని బహదూర్‌ పల్లిలో జరిగే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. లబ్ధిదారులకు ఆయనే స్వయంగా హక్కు పత్రాలు, ఇంటి తాళాలు అందజేస్తారు. మిగతా 23 నియోజకవర్గాల పరిధిలో ఇతర మంత్రులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.

చాంద్రాయణగుట్ట, బహదూర్ పుర నియోజకవర్గాలకు సంబంధించి మంత్రి మహమూద్ అలీ లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తారు. మరో మంత్రి పి.మహేందర్‌ రెడ్డి రాజేంద్రనగర్‌ నియోజకవర్గ లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేస్తారు. మంత్రి తలసాని శేరిలింగంపల్లి నియోజకవర్గ లబ్ధిదారులకు, పటాన్ చెరువు, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, గోషామహల్, నాంపల్లి, కార్వాన్ లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేస్తారు.

సెప్టెంబర్-2 జీహెచ్ఎంసీ పరిధిలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 500మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి 9 ప్రాంతాల్లో లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించారు. ఏడుగురు మంత్రులు జీహెచ్ఎంసీ మేయర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్.. వేర్వేరు ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.


First Published:  1 Sep 2023 2:00 AM GMT
Next Story