Telugu Global
Telangana

సిరిసిల్లలో ఐదోసారి కేటీఆర్ నామినేషన్..

సిరిసిల్ల ఎమ్మెల్యేగా తాను ఏం చేశాను అనే విషయాన్ని ఇంటింటికీ ప్రగతి నివేదిక రూపంలో పంపిస్తున్నానని చెప్పారు. ఏ ఊరికి తన వల్ల ఏం ఉపయోగం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నానని అన్నారు కేటీఆర్.

సిరిసిల్లలో ఐదోసారి కేటీఆర్ నామినేషన్..
X

సిరిసిల్లలో ఐదోసారి కేటీఆర్ నామినేషన్..

మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సిరిసిల్ల నుంచి ఐదోసారి బరిలో నిలుస్తున్నారు. నామినేషన్ సందర్భంగా ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రగతి భవన్ నుంచి బయలుదేరి సిరిసిల్లకు చేరుకున్నారు. ఆర్వో కేంద్రంలో ఆయన నామినేషన్ వేశారు. అనంతరం ఆర్మూర్ లో రోడ్ షో, సాయంత్రం కొడంగల్ రోడ్ షో లో పాల్గొంటారు కేటీఆర్.


2009 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేసిన కేటీఆర్ కేకే మహేందర్‌ రెడ్డిపై విజయం సాధించారు. 2010 ఉప ఎన్నికలు, 2014, 18 జనరల్ ఎన్నికల్లో వరుసగా సిరిసిల్లనుంచి పోటీ చేశారు. ప్రతి సారీ ఆయన మెజార్టీ పెరుగుతూ పోయింది. చివరిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు కేటీఆర్. ఈసారి ఆయన మెజార్టీ మరింత పెరుగుతుందని అంచనా.

నామినేషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్, గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.. తామే అభ్యర్థి అన్నంత ధీమాతో ప్రజల్లోకి వెళ్లారని, నాలుగుసార్లు తనను గెలిపించారని, ఈసారి కూడా అదే ఉత్సాహంతో తనను గెలిపిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా తాను ఏం చేశాను అనే విషయాన్ని ఇంటింటికీ ప్రగతి నివేదిక రూపంలో పంపిస్తున్నానని చెప్పారు. ఏ ఊరికి తన వల్ల ఏం ఉపయోగం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నానని అన్నారు కేటీఆర్. గతంలో 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రజలు కూడా ఇదే విషయంలో ఆలోచన చేయాలన్నారు. వారు చేయలేనిది తొమ్మిదిన్నరేళ్లలో తాము చేసి చూపించామన్నారు.

కేసీఆర్ గొంతు నొక్కాలనే అజెండాతో రాహుల్ గాంధీ, నరేంద్రమోదీ.. తెలంగాణపై దండయాత్రగా వస్తున్నారని దాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. మనలో మనకు ఉన్న అసంతృప్తులను మనమే చక్కబెట్టుకుంటామని, ఢిల్లా నేతలకు, గుజరాత్ నేతలకు పెత్తనం ఇవ్వొద్దన్నారు. ఒకనాటి కాకతీయ సామ్రాజ్యం, ఇప్పుడు కర్నాటకకు సామంత రాజ్యం కావాలా..? అని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్.

First Published:  9 Nov 2023 7:58 AM GMT
Next Story