Telugu Global
Telangana

'బలగం' మొగిలయ్యకు మంత్రి కేటీఆర్ ఆపన్నహస్తం.. చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ

బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలకు తోడు.. ఇప్పుడు మొగిలయ్య కళ్లు కూడా సరిగా కనిపించడం లేదు. కరోనా కారణంగానే కిడ్నీలు దెబ్బతిన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

బలగం మొగిలయ్యకు మంత్రి కేటీఆర్ ఆపన్నహస్తం.. చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ
X

'బలగం' సినిమా క్లైమాక్స్‌లో వచ్చే పాటను అత్యంత హృద్యంగా పాడి అందరి మనసులను దోచుకున్న బుడగజంగాల కళాకారులు మొగిలయ్య, కొమురవ్వ దంపతులకు ఇప్పుడు ఓ కష్టం వచ్చింది. బలగం మొగిలయ్యగా అందరూ పిలుచుకుంటున్న ఆ కళాకారుడు గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రెండు దశాబ్దాలుగా బుర్ర కథలు చెప్పుకుంటూ పొట్ట పోసుకుంటున్న ఆ కుటుంబం.. మొగిలయ్య అనారోగ్యం కారణంగా కుదేలయ్యింది. కరోనా సమయంలో మొగిలయ్య రెండు కిడ్నీలు పాడయ్యాయి. అప్పటి నుంచి రెండు రోజులకు ఓ సారి డయాలసిస్ చేయించుకుంటున్నారు.

బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలకు తోడు.. ఇప్పుడు మొగిలయ్య కళ్లు కూడా సరిగా కనిపించడం లేదు. కరోనా కారణంగానే కిడ్నీలు దెబ్బతిన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం ఆ దంపతులకు భారంగా మారింది. కాగా, మీడియాలో వచ్చిన వార్తలు చూసిన మంత్రి కేటీఆర్.. మొగిలయ్యకు సాయం చేస్తానని చెప్పారు. వెంటనే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కాల్ చేశారు. మొగిలయ్య కుటుంబానికి ప్రభుత్వం తరపున సాయం అందించాలని కోరారు. ఆయన వైద్యానికి అవసరమయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ఫోన్‌లో కేటీఆర్ తెలిపారు. అంతే కాకుండా మొగిలయ్య ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ పథకం ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పాలని పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ సూచించారు.

నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రంలో మొగిలయ్య, కొమురవ్వ దంపతులు నివసిస్తున్నారు. కేటీఆర్ కాల్ చేసిన వెంటనే ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లారు. మొగిలయ్య వైద్యానికి ఎన్ని లక్షలు ఖర్చు అయినా లైన్ ఆఫ్ క్రెడిట్ చెక్ (ఎల్ఓసీ) ద్వారా డబ్బు అంద జేస్తామని చెప్పారు. ఎల్వోసీ ప్రొసీజర్ వెంటనే ప్రారంభించి.. అది వచ్చిన వెంటనే మొగిలయ్యను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ బాధ్యతలు అన్నీ నర్పంపేటకు చెందిన రైతు సమన్వయ సమితి నాయకుడు తోకల నర్పింహారెడ్డి చూస్తారని ఎమ్మెల్యే చెప్పారు.

కాగా, మొగిలయ్య కష్టాన్ని చూసి ఇప్పటికే బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి రూ.1 లక్ష సాయం అందించారు. దిల్ రాజు ప్రొడక్షన్ వాళ్లు కూడా మొగిలయ్యకు సాయం చేస్తామని ప్రకటించారు. ఇక చాలా మంది అభిమానులు కూడా మొగిలయ్య కుటుంబానికి అండగా ఉంటామని చెబుతున్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డైరెక్టర్ వేణు, ఫ్యాన్స్‌కు బెడ్ మీద నుంచే మొగిలయ్య థ్యాంక్స్ చెబుతున్నారు.

First Published:  30 March 2023 4:48 AM GMT
Next Story