Telugu Global
Telangana

ఓటు వేసిన కేటీఆర్.. మీడియాతో ఏం చెప్పారంటే..?

రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే తాను ఓటు వేశానన్నారు కేటీఆర్.

ఓటు వేసిన కేటీఆర్.. మీడియాతో ఏం చెప్పారంటే..?
X

మంత్రి కేటీఆర్ సతీసమేతంగా బంజారాహిల్స్‌ లోని నందినగర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చానని.. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే తాను ఓటు వేశానన్నారు కేటీఆర్. తెలంగాణలో ఓటు ఉన్న పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ఇది పెద్ద పండుగ అని చెప్పారు కేటీఆర్. నగర, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పూర్తిస్థాయిలో ఓటింగ్ కోసం రావడం లేదని, అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పట్టణాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. విద్యావంతులంతా తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

అంతకు ముందు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు తన సందేశాన్నిచ్చారు. "మీ ఓటు.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి" అంటూ ట్వీట్ చేశారు. ఈ రోజు వేసే ఓటు సబ్బండ వర్ణాల్లో.. సంతోషాన్ని పదిల పరచాలని, తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా, సగర్వంగా ఎగరేసేదిగా ఉండాలని అన్నారు. ప్రజల చేతిలో ఓటు వజ్రాయుధం అని దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కానివ్వొద్దని చెప్పారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలంటే ప్రజలంతా ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

First Published:  30 Nov 2023 6:45 AM GMT
Next Story