Telugu Global
Telangana

కేంద్రం సహకరించకపోయినా నెంబర్-1 రాష్ట్రంగా తెలంగాణ

కరెంటు, తాగు, సాగునీరు వంటి మౌలిక సమస్యలను వదిలేసి కొందరు హిజాబ్‌, హలాల్‌, యూనిఫాం సివిల్‌ కోడ్‌.. ఇలాంటి వాటివెంట పడ్డారని గుర్తుచేశారు. అలాంటి నాన్సెన్స్‌ ను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, రాష్ట్రంలో జాతి, కులం, మతం, లింగ బేధం చూపలేదని వివరించారు మంత్రి కేటీఆర్.

కేంద్రం సహకరించకపోయినా నెంబర్-1 రాష్ట్రంగా తెలంగాణ
X

కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్లలోనే అభివృద్ధిలో నెంబర్-1 గా నిలిచిందని అన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటి వరకు కేంద్రం, తెలంగాణకు రూ.35 వేల కోట్లు ఇవ్వాలని గుర్తు చేశారు. హైదరాబాద్‌ మెట్రో నిర్మాణానికి రూపాయి సహాయం కూడా చేయలేదన్నారు. ప్రధాని మోదీ కేవలం గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ కు మాత్రమే నిధులిస్తారని, ఓటు రాజకీయాలు తప్ప ఆయన ప్రజా సంక్షేమం పట్టించుకోలేదని మండిపడ్డారు. ‘అభయ్‌ త్రిపాఠి స్మారక ఉపన్యాస’ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ‘నూతన రాష్ట్రంగా తెలంగాణ ఎదుర్కొన్న సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో 9 ఏళ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా ఎదిగిందని వివరించారు.

ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ ప్రాంతాన్ని చూసినా బయటనుంచి వచ్చినవాళ్లే ఎక్కువగా ఉంటారని, అలాగే హైదరాబాద్ లో కూడా బయటిప్రాంతాలవారే ఎక్కువ అని చెప్పారు. అంతమాత్రాన వారందర్నీ వలసవాదులు అనడం సరికాదన్నారు. తెలంగాణ, హైదరాబాద్‌ ను సొంత ప్రాంతంగా భావించి అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. సంపద సృష్టే అసలైన రాజకీయం అని సీఎం కేసీఆర్‌ బలంగా నమ్ముతారని, ఇప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఎదగడానికి కూడా కారణం అదేనన్నారు.


1950 నుంచి 2014 వరకు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పాడ్డాయని, కానీ తెలంగాణ ఏర్పాటు మాత్రం ఇతర రాష్ట్రాలకంటే భిన్నంగా జరిగిందని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. దశాబ్దాల ఉద్యమం తర్వాత తెలంగాణ కల సాకారమైందన్నారు. 2001లో టీఆర్ఎస్ స్థాపనతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుందని గుర్తు చేశారు. రాజకీయంగా, సామాజికంగా పోరాటాలు సాగించి తెలంగాణ సాధించుకున్నామని వివరించారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అనుమానాల మధ్యలో అభివృద్ధి సాధించి చూపించామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలకు కట్టుబడి పాలన సాగిస్తున్నామని చెప్పారు. కరెంటు, తాగు, సాగునీరు వంటి మౌలిక సమస్యలను వదిలేసి కొందరు హిజాబ్‌, హలాల్‌, యూనిఫాం సివిల్‌ కోడ్‌.. ఇలాంటి వాటివెంట పడ్డారని గుర్తుచేశారు. అలాంటి నాన్సెన్స్‌ ను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, రాష్ట్రంలో జాతి, కులం, మతం, లింగ బేధం చూపలేదని వివరించారు.

తెలంగాణ ఏర్పాటు సమయానికి విద్యుత్ ఉత్పత్తి 8,700 మెగావాట్లు ఉంటే, ఇప్పుడు 18 వేల మెగావాట్లకు పెరిగిందని చెప్పారు మంత్రి కేటీఆర్. వచ్చే ఏడాది 26 వేల మెగావాట్లకు చేరుతుందని, కరెంటు లోటుతో ఏర్పడిన రాష్ట్రం దశాబ్ద కాలంలోనే ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయికి చేరడం గర్వకారణం అన్నారు. మిషన్‌ కాకతీయతో 46 వేలకుపైగా చెరువులు, కుంటలను బాగు చేశామని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం ‘కాళేశ్వరం’ను రికార్డు స్థాయిలో పూర్తి చేశామని.. హైదరాబాద్‌ కు 2052 వరకు నీటి సమస్య రాకుండా చేశామని చెప్పారు కేటీఆర్.

తెలంగాణ మాడల్‌ అంటే.. సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధికి చిరునామా అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘జనాభాలో 3 శాతమే ఉన్నా, జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉన్నామని, జాతీయ స్థాయిలో అటు పంచాయతీ, ఇటు మున్సిపల్‌ అవార్డుల్లో 30 శాతం రాష్ట్రానికే వస్తున్నాయని వివరించారు. దేశంలో మోదీ మార్పు తెస్తారనే అంచనాతోనే మొదట్లో ఆయన నిర్ణయాలకు మద్దతు తెలిపామని.. వన్‌ నేషన్‌ వన్‌ ట్యాక్స్‌, రాష్ట్రపతిగా రామ్‌ నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గెలుపుకి సహకరించామన్నారు కేటీఆర్. అయినా మోదీ తెలంగాణకు మొండి చేయి చూపారని మండిపడ్డారు. కనీసం విభజన చట్టంలోని హామీలు కూడా అమలు చేయలేదన్నారు.

100 శాతం ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయని, ఇంటింటికీ నీళ్లు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌, ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానం, ఐటీ ఉద్యోగాల కల్పనలో మేటి, అతి ఎక్కువ గ్రీన్‌ కవర్‌ పెరుగుదల, బెస్ట్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ, దేశంలోనే అతిపెద్ద టెక్స్‌ టైల్‌ పార్కు, వ్యాక్సిన్‌ హబ్‌, దేశంలోనే పునరుత్పాద శక్తిలో రెండో స్థానం, జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం.. ఇలా తెలంగాణకు ఎన్నో ఘనతలు ఉన్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి తదితర ఏ రంగంలో చూసుకున్నా తెలంగాణ నెంబర్‌-1 అని స్పష్టం చేశారు. దేశంలోని మిగతా 27 రాష్ట్రాలు కూడా తెలంగాణ లాగే కష్టపడితే 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎప్పుడో సాకారం అయ్యేదని తెలిపారు కేటీఆర్.

First Published:  22 July 2023 12:51 AM GMT
Next Story