Telugu Global
Telangana

ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.. - పద్మవిభూషణ్‌కు ఎంపికపై మెగాస్టార్‌ చిరంజీవి

పద్మవిభూషణ్‌ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. మనదేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్‌ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.. - పద్మవిభూషణ్‌కు ఎంపికపై మెగాస్టార్‌ చిరంజీవి
X

కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్‌ చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికయ్యారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ తనకు లభించడంపై చిరంజీవి ఎక్స్‌ (ట్విట్ట‌ర్‌) వేదికగా స్పందించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఇంతకీ అందులో ఏముందంటే.. ‘పద్మవిభూషణ్‌ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. మనదేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్‌ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం అండదండలు, నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. నాకు దక్కినటువంటి ఈ గౌరవం మీది.’ అని పేర్కొన్నారు.

అంతేకాదు.. ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను..’ అంటూ ఆయన స్పందించారు. ఇంకా.. తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నానని, నిజజీవితంలో కూడా తన చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైనప్పుడు తనకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నానని, కానీ తనపై చూపిస్తున్న కొండంత అభిమానానికి ప్రతిగా తాను ఇస్తున్నది గోరంతేనని ఆయన వినమ్రంగా చెప్పారు. ఈ నిజం తనకు ప్రతిక్షణం గుర్తుకువస్తూనే ఉంటుందని, తనను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుందని తెలిపారు. ‘నన్ను ఈ ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు.

First Published:  26 Jan 2024 2:29 AM GMT
Next Story