Telugu Global
Telangana

ఎమ్మెల్సీలకు లైన్ క్లియర్.. మరోసారి కేబినెట్ తీర్మానం

హైకోర్టు నిర్ణయంతో ప్రభుత్వం పెద్దగా ఇబ్బంది పడలేదు కానీ, గవర్నర్ వ్యవహారం మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వ సిఫారసులకే మళ్లీ మోక్షం కలుగుతోంది.

ఎమ్మెల్సీలకు లైన్ క్లియర్.. మరోసారి కేబినెట్ తీర్మానం
X

తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినెట్ మరోసారి నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్‌ కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ పేర్లను మరోసారి ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో తాజాగా కేబినెట్ తీర్మానం చేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయాన్ని గవర్నర్ కు పంపేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అయితే గవర్నర్ తమిళిసై కేబినెట్ సిఫారసులను తిరస్కరించారు. ఎన్నికలయ్యాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్‌ కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ పేర్లను సిఫారసు చేసింది. ఈ సిఫారసుని వెంటనే గవర్నర్ ఆమోదించారు. అయితే ఈలోగా గవర్నర్ తిరస్కరించిన జాబితాలో ఉన్న ఇద్దరు హైకోర్టుని ఆశ్రయించారు. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ పక్కనపెట్టడం సరికాదన్నారు. హైకోర్టు కూడా ఎమ్మెల్సీల నియామకంలో గవర్నర్‌ వ్యవహరించిన తీరు సరికాదని పేర్కొంది. గత ప్రభుత్వ సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్‌ 19న గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్‌ లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని స్పష్టం చేసింది.

హైకోర్టు నిర్ణయంతో ప్రభుత్వం పెద్దగా ఇబ్బంది పడలేదు కానీ, గవర్నర్ వ్యవహారం మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వ సిఫారసులకే మళ్లీ మోక్షం కలుగుతోంది. కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల పేర్లను సిఫారసు చేస్తూ రేవంత్ కేబినెట్ మళ్లీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఫైనల్ కాబోతోంది.

First Published:  12 March 2024 11:43 AM GMT
Next Story