Telugu Global
Telangana

ఆయనో గుంపు మేస్త్రీ.. ఈయనో తాపీ మేస్త్రీ

మోదీ ప్రియమైన ప్రధాని కాదని, ఆయన ఓ పిరమైన ప్రధాని అని అన్నారు కేటీఆర్. పెట్రోల్, డీజిల్‌తో సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసిన మోదీకి ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు.

ఆయనో గుంపు మేస్త్రీ.. ఈయనో తాపీ మేస్త్రీ
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి సెటైర్లు పేల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారిద్దరూ తెలంగాణకు సమాధి కట్టేందుకు కలసి పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో మోదీ, రేవంత్‌కు సహకారం అందించారని, ఇప్పుడు దానికి బదులుగా లోక్ సభ ఎన్నికల్లో రేవంత్, మోదీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ ఓ గుంపు మేస్త్రీ, మోదీ ఓ తాపీ మేస్త్రీ అని కౌంటర్ ఇచ్చారు.

వికారాబాద్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో దేశానికి జరిగిన మేలు ఏమీ లేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే రాముడి పేరుతో ఓట్లడుగుతున్నారని చెప్పారు. రాముడు మనకు కూడా దేవుడేనని.. రాముడికి మనం కూడా మొక్కుదామని, అదే సమయంలో బీజేపీని పండబెట్టి తొక్కుదామని పిలుపునిచ్చారు కేటీఆర్.

మోదీ ప్రియమైన ప్రధాని కాదని, ఆయన ఓ పిరమైన ప్రధాని అని అన్నారు కేటీఆర్. పెట్రోల్, డీజిల్‌తో సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసిన మోదీకి ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు. తెలంగాణకు కూడా మోదీ ఏమీ చేయలేదని అన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వలేదని, రెండు లక్షల ఉద్యోగాలు కూడా బోగస్ మాటలేనని, రూ.15 లక్షలు పేదల అకౌంట్లలో జమచేయడం కూడా అబద్ధమేనని అన్నారు. బీజేపీ నాయకులు చెబుతున్నట్టు మోదీ హవా ఉంటే పక్క పార్టీల నుంచి ఎందుకు అభ్యర్థులను తెచ్చుకుంటున్నారని ప్రశ్నించారు కేటీఆర్‌.

కాంగ్రెస్‌ ఓ దిక్కుమాలిన పార్టీ అని, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని.. అన్నారు కేటీఆర్. కేసీఆర్‌ను మోసం చేసి వెళ్లిపోయిన వారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులంతా తమ వద్దనుంచి వెళ్లినవారేనని గుర్తు చేశారు. రేవంత్‌ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నాయకుడిలానే మాట్లాడుతున్నారని, ఓడిపోతామని తెలిసే మల్కాజ్‌గిరి, చేవెళ్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టారని చెప్పారు కేటీఆర్. విశ్వేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి ఇద్దరూ విశ్వాస ఘాతకులేనని.. వారిని ఓడించాలని పిలుపునిచ్చారు కేటీఆర్.

First Published:  4 April 2024 4:00 AM GMT
Next Story