Telugu Global
Telangana

రూ. 1.83 లక్షల కోట్లకు చేరుకున్న తెలంగాణ ఎగుమతులు : మంత్రి కేటీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్‌కు రాబోతోందని వెల్లడించారు. ఇప్పటి వరకు అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

రూ. 1.83 లక్షల కోట్లకు చేరుకున్న తెలంగాణ ఎగుమతులు : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ రాష్ట్ర ఎగుమతులు ప్రస్తుతం రూ. 1.83 లక్షల కోట్లకు చేరుకున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 2014లో తెలంగాణ నుంచి రూ. 57 వేల కోట్ల ఎగుమతులు ఉండగా.. ఇప్పుడు వాటి విలువ గణనీయంగా పెరిగినట్లు వివరించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నై, ముంబై, కోల్‌కతా వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో జీవనం ఎంతో సులభమని చెప్పారు.

హైదరాబాద్‌లో మౌళిక సదుపాయాలు మరింత మెరుగు పరచడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. భారీగా ఉత్పత్తులు చేసే చైనా, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలతో ఇండియా ఎలా పోటీ పడాలనే విషయంపై సీఐఐ సమగ్రంగా చర్చించాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్‌కు రాబోతోందని వెల్లడించారు. ఇప్పటి వరకు అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

విప్రో, సేల్స్ ఫోర్స్, మెటా, ఉబర్ వంటి పెద్ద సంస్థల రెండో అతిపెద్ద క్యాంపస్‌లకు హైదరాబాద్ నెలవైందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనమని తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో కూడా రాష్ట్రం దూసుకొని పోతోందని వివరించారు. నగరం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందని.. దేశంలోని ఏ ప్రాంతం వాళ్లైనా హైదరాబాద్ వచ్చి హాయిగా జీవించే సౌకర్యాలున్నాయని మంత్రి చెప్పారు.

3ఐ మంత్రాను పాటిస్తే దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్ అనేవి చాలా ముఖ్యమని చెప్పారు. ఇండియా అభివృద్ధి చెందడానికి ఇవి కీలకమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సౌత్ ఇండియాలో వ్యాపార సంబంధాలు బలపరిచే నేపథ్యంలో సీఐఐ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.



First Published:  12 Nov 2022 1:41 PM GMT
Next Story