Telugu Global
Telangana

వినయ విధేయ రేవంత్.. కేటీఆర్ సరికొత్త సెటైర్

తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా రేవంత్‌రెడ్డికి సీఎం పదవి దక్కిందని ఎద్దేవా చేశారు కేటీఆర్‌. హామీలను నెరవేర్చే సత్తా లేక చివరకు ఫోన్‌ ట్యాపింగ్‌లంటూ ప్రజలకు పిచ్చి కథలు చెబుతున్నారని మండిపడ్డారు.

వినయ విధేయ రేవంత్.. కేటీఆర్ సరికొత్త సెటైర్
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వీర విధేయుడంటూ సెటైర్లు పేల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పార్టీ గెలుపు కోసమే తెలంగాణలో డమ్మీ అభ్యర్థుల్ని నిలబెడుతున్నారని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం కాకుండా, బీజేపీ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్ కి లేదని, అలాంటి పార్టీకి తెలంగాణలో ఓట్లు వేసి వృథా చేసుకోవద్దన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటు వేస్తేనే, కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చి హామీలు అమలు చేయించుకోగలం అన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.


తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా రేవంత్‌రెడ్డికి సీఎం పదవి దక్కిందని ఎద్దేవా చేశారు కేటీఆర్‌. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి, ఒక్కటి కూడా సరిగ్గా చేయడం లేదని విమర్శించారు. ఏం చేయాలో తెలియక, హామీలను నెరవేర్చే సత్తా లేక చివరకు ఫోన్‌ ట్యాపింగ్‌లంటూ ప్రజలకు పిచ్చి కథలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా డెడ్ లైన్లు మారుస్తున్నారని, అప్పుడు కూడా ఆ హామీలు అమలు చేయడం కాంగ్రెస్ కి ఇష్టంలేదని అన్నారు. హామీల అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ కి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు కేటీఆర్.

కుల, మతాలను గౌరవించలేని పార్టీలను రాబోయే ఎన్నికల్లో తొక్కేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. శ్రీరాముడు దేవుడని, ఆయన్ను అందరూ పూజించాలని, ఆయనతో ఎవరికీ ఏ పంచాయితీ లేదన్నారు. కానీ బీజేపీ నేతలు జై శ్రీరామ్ అనడం మినహా దేశానికి చేసిందేంటని ప్రశ్నించారు. దేశంలోని రాజకీయ పార్టీల్లోని నాయకులంతా.. ఉంటే మోదీ జేబులో, లేదా జైలులో ఉండాలన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు కేటీఆర్.

First Published:  19 April 2024 1:25 AM GMT
Next Story