Telugu Global
Telangana

ఆ వార్త వింటే బాధగా ఉంది -కేటీఆర్

రాష్ట్రంలో చిప్‌ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వంతో కెయిన్స్ టెక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా వారికి కొంగర కలాన్‌ ప్రాంతంలో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ పక్కనే భూమిని కేటాయించారు.

ఆ వార్త వింటే బాధగా ఉంది -కేటీఆర్
X

కర్నాటక నుంచి తెలంగాణకు వచ్చేలా కెయిన్స్ కంపెనీని ఒప్పించామని, ఇప్పుడు ఆ కంపెనీ తెలంగాణ నుంచి తరలిపోతుందనే వార్త వింటే బాధగా ఉందని చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. కెయిన్స్ కంపెనీ OSAT యూనిట్.. ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీకండక్టర్ పరిశ్రమలో ముఖ్యమైన భాగం అని.. అలాంటి కంపెనీ తెలంగాణ నుంచి తరలిపోవడం దురదృష్టకరం అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకోవాలని, కెయిన్స్ ప్రతినిధులతో మాట్లాడి.. ఆ కంపెనీ ఇక్కడే ఉండేలా చొరవ తీసుకోవాలని సూచించారు.


10రోజుల్లో పని పూర్తి చేశాం..

రాష్ట్రంలో చిప్‌ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వంతో కెయిన్స్ టెక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా వారికి కొంగర కలాన్‌ ప్రాంతంలో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ పక్కనే భూమిని కేటాయించారు. వారిని ఒప్పించేందుకు కేవలం 10 రోజులలోపే భూమిని కేటాయించింది అప్పటి ప్రభుత్వం. చకచకా అనుమతులు ఇచ్చి కంపెనీ ఏర్పాటుకి కృషి చేశామని, ఇప్పుడు కంపెనీ గుజరాత్ కి తరలిపోవడం బాధాకరం అంటున్నారు కేటీఆర్.

అయితే కెయిన్స్ టెక్ కంపెనీ తరలిపోయే వ్యవహారం కనీసం పరిశ్రమల శాఖ అధికారులకు కూడా తెలియకపోవడం విశేషం. తమకు దానిపై సమాచారం లేదని అంటున్నారు పరిశ్రమల శాఖ అధికారులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయంపై యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో కంపెనీలు తరలి వస్తే, కాంగ్రెస్ గద్దనెక్కిన 100 రోజుల్లోపే రెండు ప్రముఖ కంపెనీలు తరలిపోతున్నాయని కౌంటర్లిస్తున్నారు నెటిజన్లు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  12 March 2024 11:02 AM GMT
Next Story