Telugu Global
Telangana

కోదండరాం కోర్కెల్ని కాంగ్రెస్ నెరవేరుస్తుందా..?

కేసీఆర్ ని దెబ్బతీయాలంటే.. కూటమిలో కోదండరాం ఉండాలంటున్నారు కొంతమంది హస్తం పార్టీ నేతలు. అయితే కోదండరాంకు తెలంగాణలో ప్రస్తుతం అంత పరపతి ఉందా అనేది మాత్రం డౌటే.

కోదండరాం కోర్కెల్ని కాంగ్రెస్ నెరవేరుస్తుందా..?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లు కావాలంటూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్ పార్టీ ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. ఆరు సీట్లు, ఆ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న తమ అభ్యర్థుల జాబితాను తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేకి అందించారు. అధినాయకత్వంతో చర్చించి సీట్ల విషయం తేలుస్తామని కోదండరాంకి ఠాక్రే హామీ కూడా ఇచ్చారు. అయితే కోదండరాం పార్టీకి ఆరు సీట్లు.. కాంగ్రెస్ త్యాగం చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

పొత్తులకోసం కాంగ్రెస్ వెంపర్లాట..

తెలంగాణలో వామపక్షాల స్థాయి ఏంటో బీఆర్ఎస్ చెప్పకనే చెప్పింది. ఒకటి లేదా రెండు సీట్లు ఇస్తామని తేల్చేసింది, కాదు కూడదనే సరికి అవి కూడా ఇవ్వను పొమ్మంది. ఇప్పుడు వామపక్షాలకు కాంగ్రెస్ తోడు అవసరం. ఇండియా కూటమి పేరు చెప్పి వామపక్షాలు, కాంగ్రెస్ ని పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. తెలంగాణ జనసమితిని కూడా కూటమిలో కలుపుకోవాలనుకుంటోంది కాంగ్రెస్ అధిష్టానం. కేసీఆర్ ని దెబ్బతీయాలంటే.. కూటమిలో కోదండరాం ఉండాలంటున్నారు కొంతమంది హస్తం పార్టీ నేతలు. అయితే కోదండరాంకు తెలంగాణలో ప్రస్తుతం అంత పరపతి ఉందా అనేది మాత్రం డౌటే.

కాంగ్రెస్ తో కోదండరాం స్నేహం ఇప్పటిది కాదు. గతంలో కాంగ్రెస్, టీడీపీతో కలసి ఆయన కూటమి కట్టారు. ఆ కూటమి విఫల ప్రయోగంగా మిగిలింది. మళ్లీ ఇప్పుడు కోదండరాంని తెరపైకి తేవాలని చూస్తోంది కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర గొప్పదే, కాదనలేం. కానీ ఉద్యమంలో ఆయనతోపాటు కలసినడచిన చాలామంది ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర అభివృద్ధిలో కూడా భాగస్వాములుగా మారారు. కానీ కోదండరాం మాత్రం కేసీఆర్ తో విభేదించి, నిత్య అసంతృప్తవాదిగా మారారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాజకీయంగా ఆయన సాధించింది శూన్యం అనే చెప్పాలి. అయితే కోదండరాంని అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ లాభపడాలని చూస్తోంది. కానీ ఇక్కడ ఆరు సీట్లు కోదండరాం పార్టీకి ఇవ్వడమంటే సాహసమనే చెప్పాలి. మరి కాంగ్రెస్ వ్యూహమేంటి..? కోదండరాంని తెరపైకి తెచ్చి, కేసీఆర్ ని దెబ్బతీయాలనే పన్నాగం ఎంతవరకు ఫలిస్తుంది. అసలు కోదండరాం-కాంగ్రెస్ స్నేహం ఆరుసీట్ల ప్రతిపాదన దగ్గరే ఆగిపోతుందా, ముందుకు సాగుతుందా..? వేచి చూడాలి.

First Published:  8 Oct 2023 5:27 PM GMT
Next Story