Telugu Global
Telangana

తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి కేటీఆర్

గవర్నర్ కోటాలో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కేబినెట్ ప్రతిపాదనలు పంపనున్నది.

తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి కేటీఆర్
X

రాష్ట్ర అసెంబ్లీకి మరి కొన్ని వారాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినట్ సమావేశం నిర్వహించారు. వర్షాకాలం అసెంబ్లీ, మండలి సమావేశాలకు ముందు జరిగిన కేబినెట్ భేటీ కావడంతో అందరికీ ఆసక్తి నెలకొన్నది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, మెట్రో లైన్ల విస్తరణతో పాటు చాలా కీలక అంశాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి కేటీఆర్ మీడియాకు వెల్లడించారు.

ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా ప్రజల జనజీవనం స్తంభించింది. అనూహ్య రీతిలో వచ్చిన అతి భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. దీని వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలపై కేబినెట్ విస్తృతంగా చర్చించినట్లు కేటీఆర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సమగ్రమైన సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో చర్చ జరిపారు. వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, అదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. వీటి వల్ల రోడ్లు పాడయ్యాయి. విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లింది. ఇంకా ఇతర రంగాల్లో కూడా భారీ నష్టం సంభవించినట్లు నివేదిక అందింది. అందుకే తక్షణ సాయం కింద రూ.500 కోట్లను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు చెప్పారు.

ప్రస్తుత సీజన్‌లో వర్షాలు కాస్త ఆలస్యంగా పడ్డాయి. ఇప్పుడే వ్యవసాయ పనులు పుంజుకుంటున్నాయి. అందుకే రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగుల అద్భుతంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. వీరిద్దరికీ ఆగస్టు 15న సత్కరించాలని, 40 మందిని కాపాడిన టీచర్‌ పాయం మీనయ్యను కూడా సన్మానించాలని కేబినెట్ నిర్ణయించింది.

వరద బాధితులకు పునరావాసం కొనసాగించాలని.. మరణించిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందించాలని నిర్ణయించారు. వరదల కారణంగా పంట పొలాలకు జరిగిన నష్టంపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరదల నుంచి కాపాడటానికి పట్టణం వెంట ఒక ఆర్‌సీసీ ఫ్లడ్ వాల్ నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన నివేదిక తయారు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

మరోసారి గవర్నర్ వద్దకు బిల్లులు..

గవర్నర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడి, పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కావాలని గవర్నర్ల ద్వారా ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనిపై కేబినెట్‌లో విస్తృత చర్చ జరిగినట్లు కేటీఆర్ చెప్పారు. చట్ట సభలకు ఉన్న గౌరవాన్ని తగ్గిస్తూ.. ప్రజల నిర్ణయాన్ని అపహాస్యం చేసేలా.. శాసన సభ పాస్ చేసిన బిల్లులను తిప్పి పంపడంపై కేబినెట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ తిప్పి పంపిన మున్సిపల్, పంచాయతీ రాజ్, విద్యా శాఖలకు చెందిన మూడు బిల్లులను తిరిగి అసెంబ్లీలో పాస్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

శాసన సభలో రెండో సారి బిల్ పాస్ చేస్తే.. గవర్నర్ ఎవరైనా, వారికి ఎలాంటి రాజకీయ అభిప్రాయాలు ఉన్నా ఆమోద ముద్ర వేయాల్సిందే. రాజ్యాంగం ప్రకారం రెండో సారి పాస్ చేసిన వాటికి గవర్నర్ తప్పకుండా ఆమోదం తెలపాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

తెలంగాణ ఆర్ఫన్ పాలసీ..

తెలంగాణ ప్రభుత్వం ఒక మానవీయ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా.. ఆనాధ పిల్లల సంరక్షణ, ఆలనా పాలనా చూసే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అనాధలను చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్‌గా గుర్తిస్తూ తెలంగాణ ఆర్ఫన్ పాలసీని పడక్బంధీగా రూపొందించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రిని, అధికారులను ఆదేశించారు. మానవీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోంది. పేదలకు, వెనుకబడిన వారి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. తాజాగా అనాధలకు ప్రభుత్వమే తల్లి, తండ్రిగా ఉండేలా ఆర్ఫన్ పాలసీని తీసుకొని రానున్నట్లు కేటీఆర్ చెప్పారు. అనాధలకు ఆశ్రయం కల్పించి, ప్రయోజకులుగా ఎదిగి, వారి కంటూ ఒక కుటుంబం ఏర్పడే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఈ పాలసీపై కొన్ని సూచనలు చేశారు. వాటిని కూడా పరిశీలించి.. ఈ పాలసీకి రాబోయే కేబినెట్‌లో ఆమెదం తెలియ జేస్తామని మంత్రి చెప్పారు.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ

గవర్నర్ కోటాలో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కేబినెట్ ప్రతిపాదనలు పంపనున్నది. ఎస్టీల్లో బాగా వెనుకబడిన ఎరుకల సామాజిక వర్గానికి ఒక సీటు కేటాయించారు. రాజకీయంగా కూడా పెద్దగా వీరికి అవకాశాలు రావడం లేదు. అందుకే మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే బలహీన వర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్‌ను మరో ఎమ్మెల్సీగా నియమించడానికి కేటినెట్ తీర్మానం చేశారు. త్వరలోనే ఈ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు.

వీటితో పాటు దాదాపు 50కి పైగా అంశాలపై చర్చ జరిగినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యానవన కళాశాల ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో హైబ్రీడ్ విధానంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. నిమ్స్‌లో 2వేల పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.1,800 కోట్ల విడుదల చేయడానికి పచ్చ జెండా ఊపారు. అలాగే బీడీ కార్మికులతో పాటు టేకేదారులకు కూడా ఫించన్లు ఇవ్వాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌లో రెండో ఎయిర్‌పోర్టు..

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఎదిగింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రెండో ఎయిర్ పోర్టును నిర్మించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు దక్షిణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు సేవలు అందిస్తోంది. ఏడాదికి దాదాపు 2.5 కోట్ల మంది ఈ విమానాశ్రయాన్ని వాడుకుంటున్నారు. అలాగే ఉత్తరం వైపు కూడా ఒక ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

హకీంపేటలో ఉన్న రక్షణ రంగ ఎయిర్ పోర్టును పౌరవిమానయాన సేవలకు ఉపయోగించాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. గోవాలో ఎలాగైతే రక్షణ రంగ ఎయిర్ పోర్టునే పౌర విమానయాన శాఖ వాడుకుంటున్నదో.. అదే విధంగా హకీంపేట ఎయిర్ పోర్టును హైబ్రీడ్ మోడల్‌లో పౌర విమానాల కోసం ఉపయోగించేలా తీర్మానం చేశారు. త్వరలోనే ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఇక వరంగల్ లోని మమునూరు విమానాశ్రయం కోసం 253 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదించినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.

మరికొన్ని నిర్ణయాలు..

- సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీకి హైదరాబాద్‌లో స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

- కొత్తగా 8 మెడికల్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం. దీంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవనున్నట్లు కేటీఆర్ చెప్పారు.

- వరదల్లో మరణించిన వారికి నివాళి అర్పిస్తూ కేబినెట్ తీర్మానించింది.

- రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు రానుందన ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్లర్లు ఆదేశాలు ఇచ్చారు.

- అంటువ్యాధులు రాకుండా సమగ్రమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్, వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు ఇచ్చారు.

First Published:  31 July 2023 4:49 PM GMT
Next Story