Telugu Global
Telangana

పొద్దుతిరుగుడు పువ్వులు.. జంపింగ్ నేతలపై కేసీఆర్ సెటైర్లు

కడియం పార్టీ మారారు కానీ, కాంగ్రెస్ లోకి వెళ్లి ఏం సాధించలేరని, ఆయన కర్మ బాగోలేకే బీఆర్ఎస్ ని వీడిపోయారన్నారు కేసీఆర్.

పొద్దుతిరుగుడు పువ్వులు.. జంపింగ్ నేతలపై కేసీఆర్ సెటైర్లు
X

కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నవారిపై కేసీఆర్ సెటైర్లు పేల్చారు. వారంతా పొద్దు తిరుగుడు పువ్వులని, అధికారంఎటువైపు ఉంటే అటువైపు తిరిగిపోతారన్నారు. ముఖ్యంగా కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయి ఇంటి దగ్గర ఉన్న కడియంను తానే ఎమ్మెల్సీని చేసి ఉప ముఖ్యమంత్రిని చేశానని గుర్తు చేశారు. పార్టీని వీడిపోయేటప్పుడు అందరూ స్వేచ్ఛ లేదని అంటున్నారని.. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, పదువులు అనుభవించినప్పుడు కడియంకు స్వేచ్ఛ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు కేసీఆర్. కడియం కుమార్తె కావడం వల్లే కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చామని, చివరకు వారు పార్టీ మారారని అన్నారు.

కడియం పార్టీ మారారు కానీ, కాంగ్రెస్ లోకి వెళ్లి ఏం సాధించలేరని, ఆయన కర్మ బాగోలేకే బీఆర్ఎస్ ని వీడిపోయారన్నారు కేసీఆర్. రాజకీయంగా తనను తానే భూ స్థాపితం చేసుకున్నారని చెప్పారు. కడియం వెళ్లిపోవడం వల్ల బీఆర్ఎస్ కి మేలు జరిగిందని, వరంగల్‌లో తాను చచ్చి, బీఆర్‌ఎస్‌ను బతికించారని అన్నారు. వరంగల్‌ ఫలితాలు అందరికీ కనువిప్పునిస్తాయన్నారు కేసీఆర్.

బీఆర్ఎస్ ఓ మహాసముద్రం..

బీఆర్ఎస్ ఓ మహాసముద్రం అని, వందల మంది ఎమ్మెల్యేలను, పదుల సంఖ్యలో ఎమ్మెల్సీలను, పదుల సంఖ్యలో ఎంపీలను, డజన్ల కొద్ది జడ్పీ చైర్మన్లను, డీసీసీబీ చైర్మన్లను, వేల సంఖ్యలో సర్పంచ్‌లను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సింగిల్‌ విండో చైర్మన్లను సృష్టించామని అన్నారు కేసీఆర్. కడియం లాంటి కొంతమంది పార్టీని వదిలేసినంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. మరింతమంది నాయకులు బీఆర్ఎస్ లో పుట్టుకొస్తారని చెప్పారు కేసీఆర్.

First Published:  24 April 2024 5:51 AM GMT
Next Story