Telugu Global
Telangana

వడగళ్లతో కడగళ్లు.. పంటనష్టం అంచనాకు కేసీఆర్ ఆదేశాలు

వరితోపాటు, మొక్కజొన్న, మిర్చి, నువ్వులు, మినుము పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లా లోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి.

వడగళ్లతో కడగళ్లు.. పంటనష్టం అంచనాకు కేసీఆర్ ఆదేశాలు
X

అకాల వర్షం మరోసారి తెలంగాణ రైతన్నలకు తీరని నష్టం మిగిల్చింది. అయితే ఎప్పటిలాగే ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది, ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. వడగళ్ల వానతో రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పంటనష్టం జరిగిందనే సమాచారం రాగానే సీఎం కేసీఆర్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు. వెంటనే నష్టం అంచనా వేయాలని, ఆలస్యం లేకుండా నష్ట పరిహారం పంపిణీ చేయాలన్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎస్‌ కు సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి దెబ్బతిన్న పంటలకు సంబంధించిన వివరాలతో నివేదికలు తెప్పించాలని చెప్పారు.

తెలంగాణలోని 14 జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. వరంగల్‌, జనగామ, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో అరగంట నుంచి గంటసేపు వడగళ్లు పడటంతో పంట నష్టం జరిగింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరితోపాటు, మొక్కజొన్న, మిర్చి, నువ్వులు, మినుము పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లా లోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి.

శని, ఆది.. రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ధాన్యాన్ని సేకరణ కేంద్రాలకు తరలించినా ముప్పు తప్పలేదు. మరికొన్ని చోట్ల కోతలకు సిద్ధంగా ఉన్న పైరు తడిసి ముద్దయింది. వరితోపాటు అన్ని రకాల పంటలకు అకాల వర్షాలు నష్టాన్నే మిగిల్చాయి. రైతన్నల కన్నీరు తుడిచేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైంది. వెంటనే సర్వే చేపట్టింది.

First Published:  24 April 2023 1:46 AM GMT
Next Story