Telugu Global
Telangana

కరీంనగర్ కవాతు: చత్తీస్ గఢ్ మోడల్ తెస్తానన్న రేవంత్

చత్తీస్ గఢ్ సీఎం భూపేంద్ర భగేల్ రైతు సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్న రైతు బాంధవుడు అని కొనియాడారు రేవంత్ రెడ్డి. గుజరాత్ మోడల్ కావాలో.. ఛత్తీస్ గఢ్ మోడల్ కావాలో విజ్ఞులు ఆలోచించాలన్నారు.

కరీంనగర్ కవాతు: చత్తీస్ గఢ్ మోడల్ తెస్తానన్న రేవంత్
X

తెలంగాణలో బీజేపీ సభ పెడితే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వారి హడావిడితో ఏదో జరిగిపోతోందన్న భ్రమ కలిగిస్తారు. మరో ప్రతిపక్షం కాంగ్రెస్ సభ పెడితే.. రాహుల్ లేకపోతే సోనియా మాత్రమే రావాల్సి ఉంటుంది.


ఈసారి కాంగ్రెస్ పాలిత చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కరీంనగర్ కవాతుకి క్రేజ్ తెచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేస్తున్న ఆయన, కరీంనగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చత్తీస్ గఢ్ మోడల్ తెస్తానని హామీ ఇచ్చారు.


చత్తీస్ గఢ్ సీఎం భూపేంద్ర భగేల్ రైతు సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్న రైతు బాంధవుడు అని కొనియాడారు రేవంత్ రెడ్డి. భగేల్ మార్గదర్శకత్వంలో రైతును రాజును చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటానని అన్నారు. ఆయన మోడల్ ను తెలంగాణలో కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.


2004లో కరీంనగర్ గడ్డపై సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేశారని, ఆ మాట ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, అంబేద్కర్ స్టేడియం పవిత్ర స్థలం అని చెప్పారు రేవంత్ రెడ్డి. తల్లిని చంపి పిల్లను బ్రతికించారని ఆనాడు మోదీ అవహేళన చేశారని, తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని బీజేపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఇక్కడ గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారని ప్రశ్నించారు.

కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూస్తే, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని అన్నారు రేవంత్ రెడ్డి. గుజరాత్ మోడల్ కావాలో.. ఛత్తీస్ గఢ్ మోడల్ కావాలో విజ్ఞులు ఆలోచించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామన్నారు.


ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించేలా నిబంధనలు సవరిస్తామని, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి హామీలిచ్చారు.

First Published:  10 March 2023 12:29 AM GMT
Next Story