Telugu Global
Telangana

కరీంనగర్ తీగల వంతెన సేఫ్‌.. అప్రోచ్ రోడ్డు మాత్రమే కుంగింది : ఆర్ అండ్ బీ

కరీంనగర్ కేబుల్ బ్రిడ్జికి ఎలాంటి నష్టం, హానీ జరగలేదని జిల్లా ఆర్ అండ్ బీ శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ జి. సాంబశివరావు తెలిపారు.

కరీంనగర్ తీగల వంతెన సేఫ్‌.. అప్రోచ్ రోడ్డు మాత్రమే కుంగింది : ఆర్ అండ్ బీ
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పాడైపోయిందని.. బ్రిడ్జికి పగుళ్లు వచ్చాయని కొన్ని న్యూస్ ఛానల్స్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వందల కోట్ల రూపాయల వ్యయం చేసి నిర్మించిన ఈ బ్రిడ్జి మూనాళ్ల ముచ్చటగానే మిగిలిందంటూ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేశారు. దీనిపై రోడ్లు మరియు భవనాల శాఖ వివరణ ఇచ్చింది.

కరీంనగర్ కేబుల్ బ్రిడ్జికి ఎలాంటి నష్టం, హానీ జరగలేదని జిల్లా ఆర్ అండ్ బీ శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ జి. సాంబశివరావు తెలిపారు. భారీ వర్షాల కారణంగా కరీంనగర్ వైపు ఉన్న అప్రోచ్ రోడ్డుపై చిన్నపాటి పగుళ్లు మాత్రం ఏర్పడ్డాయని చెప్పారు. సాధారణంగా ఏదైనా కొత్త బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మిస్తే.. మొదటిగా పడే వర్షాల కారణంగా రోడ్డు కోసం వాడిన గ్రావెల్.. నాచురల్ కంపక్షన్‌కు గురవుతుందని పేర్కొన్నారు. ఇలా గ్రావెల్ కంపెక్షన్ చెందడం వల్ల పలు చోట్ల రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పగుళ్లు ఏర్పడటం సాధారణమే అని తెలిపారు.

వర్షాకాలం పూర్తిగా గడిచిన తర్వాత ఇలాంటి అప్రోచ్ రోడ్లకు వాడిన గ్రావెల్ నాచురల్ సెటిల్మెంట్ ద్వారా పూర్తిగా కంపాక్ట్ అవుతందని తెలిపారు. అప్పుడు అప్రోచ్ రోడ్డు పూర్తిగా గట్టిపడుతుందని.. ఆ తర్వాత దీనిపై బీటీ లేయర్ వేస్తామని చెప్పారు. క్రాష్ బారియర్ల వద్ద ప్రతీ ముప్పై మీటర్లకు ఒక ఎక్స్‌పాన్షన్ జాయింట్ ఏర్పాటు చేస్తారు. ఇలాంటి వాటి వద్ద కూడా సహజంగా పగుళ్లు ఏర్పడతాయని ఈఈ తెలిపారు.

ప్రస్తుతం తీగల వంతెనపై డైనమిక్ లైటింగ్, ఇతర పనులు పురోగతిలో ఉన్నాయి. వాహనాలను వంతెన పైకి అనుమతించడం వల్ల సందర్శకులు బ్రిడ్జిపైనే కార్లు, బైకులు పార్క్ చేస్తున్నారు. దీని వల్ల పనులకు ఆటంకం కలుగుతోంది. వాహనదారుల వల్ల సందర్శకులకు కూడా ఇబ్బంది కలుగుతోంది. అందుకే తాత్కాలికంగా వాహనాలను అనుమతించడం లేదని ఈఈ సాంబశివరావు వివరించారు.

First Published:  29 July 2023 6:58 AM GMT
Next Story