Telugu Global
Telangana

కడియం వల్ల లాభమే జరిగింది.. లాజిక్ చెప్పిన కేసీఆర్

కడియం కూతురు అనే కదా ఆమెకు టికెట్ ఇచ్చింది. అప్పుడు కడియంకు స్వేచ్ఛ కనపడలేదా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి ఖర్మ బాగా లేదన్నారు కేసీఆర్.

కడియం వల్ల లాభమే జరిగింది.. లాజిక్ చెప్పిన కేసీఆర్
X

సీనియర్‌ నేత కడియం శ్రీహరి బీఆర్ఎస్‌ను వీడి అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ సైతం ఈ అంశంపై స్పందించారు. కడియం శ్రీహరి తన రాజకీయ భవిష్యత్తును తానే భూస్థాపితం చేసుకున్నారన్నారు కేసీఆర్. ఓడిపోయి ఇంట్లో ఖాళీగా ఉన్న శ్రీహరిని పిలిపించి ఎంపీగా గెలిపించానన్నారు. సీనియర్‌గా ఆయన అవసరం రాష్ట్రంలో ఉందని రాజీనామా చేయించి, మళ్లీ బై ఎలక్షన్‌లో గెలిపించానన్నారు. ఎమ్మెల్సీని చేసి, ఉప ముఖ్యమంత్రిని చేశానన్నారు. ఒక రాజకీయ పార్టీ ఇంతకంటే ఎక్కువ ఏ పదవి ఇస్తుందని ప్రశ్నించారు కేసీఆర్.


కడియం చచ్చి, బీఆర్‌ఎస్‌ను బతికించిండు..

కడియం కూతురు కావ్యకు టికెట్‌ ఎలా వచ్చిందని ప్రశ్నించారు కేసీఆర్. కడియం కూతురు అనే కదా ఆమెకు టికెట్ ఇచ్చింది. అప్పుడు కడియంకు స్వేచ్ఛ కనపడలేదా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి ఖర్మ బాగా లేదన్నారు కేసీఆర్. అందుకే పార్టీని విడిచి వెళ్లి, రాజకీయంగా తనను తానే భూ స్థాపితం చేసుకున్నాడన్నారు. వరంగల్‌లో కడియం చచ్చి, బీఆర్‌ఎస్‌ను బతికించాడన్నారు కేసీఆర్‌. కడియం వల్ల తమకు లాభమే జరిగిందన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు కనిపిస్తాయన్నారు.

బీఆర్ఎస్‌ మహాసముద్రం..

పలువురు నేతలు బీఆర్ఎస్‌ను వీడటంపైనా స్పందించారు కేసీఆర్. "బీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లినవారు ఎంత మంది?. పిడికెడు మంది. బీఆర్‌ఎస్‌ ఒక మహాసముద్రం. వందల మంది ఎమ్మెల్యేలు, పదుల సంఖ్యలో ఎమ్మెల్సీలు, ఎంపీలు, డజన్ల కొద్ది జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు, వేల సంఖ్యలో సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను సృష్టించిన ఒక మహాసముద్రం. మాదీ ఉద్యమ పార్టీ, ఆటుపోట్లు కొత్తేం కాదు. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం. మళ్లీ తెలంగాణలో అధికారంలోకి వస్తాం" అన్నారు కేసీఆర్.

First Published:  24 April 2024 5:40 AM GMT
Next Story