Telugu Global
Telangana

పాల్ పార్టీలో చేరేందుకు ఆయన పాతిక కోట్లు అడిగారా..?

ప్రపంచంలోనే అత్యంత అవినీతి జరుగుతున్న దేశం ఇండియా అని అన్నారు కేఏపాల్. తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీకి సింబల్ ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో తాను తెలంగాణ హై కోర్టుకు వెళ్తున్నట్లు ప్రకటించారు.

పాల్ పార్టీలో చేరేందుకు ఆయన పాతిక కోట్లు అడిగారా..?
X

ప్రజాశాంతి పార్టీ పేరుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఎన్నికల సమయంలో కేఏ పాల్ చేసే హడావిడి అందరికీ తెలిసిందే. ఎన్నికల వేడిలో సందట్లో సడేమియాలాగా ఆయన వీర లెవల్లో స్టేట్ మెంట్లు కూడా ఇస్తుంటారు. తనను గెలిపిస్తే ఏపీ అప్పు అంతా తీర్చేస్తానంటారు, తెలంగాణకు వందల కోట్లు పెడ్డుబడులు తెస్తానంటారు. కేవలం హామీలే కాదు, ఆరోపణలు కూడా ఆయన ఘనంగానే చేస్తుంటారు. తనను ప్రలోభపెట్టారని, ఫలానా పార్టీలోకి రావాలన్నారని, తాను పోటీలో లేకుండా ఉండేందుకు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని కూడా చెబుతుంటారు. తాజాగా ఆయన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. తన పార్టీలో చేరేందుకు మందకృష్ణను ఆహ్వానించానని, అయితే ఆయన పాతిక కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని బాంబు పేల్చారు.

ఇటీవల తెలంగాణలో ఎస్సీ ఉప కులాల విశ్వరూప సభ జరిగింది. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మందకృష్ణ పోరాటాన్ని ఆయన కొనియాడారు. దీంతో ఆయనపై సడన్ గా ఆరోపణలు చేస్తూ తెరపైకొచ్చారు కేఏపాల్. పరేడ్ గ్రౌండ్స్ లో మందకృష్ణ సభ పెట్టినందుకు ఆయనకు రూ.72కోట్లు ముట్టాయనేది పాల్ చేసిన ప్రధాన ఆరోపణ. మోదీకి లాభం చేకూర్చేందుకే ఆయన సభ పెట్టారని, ప్రతిఫలంగా 72కోట్ల రూపాయలు తీసుకున్నారని అన్నారు. తన పార్టీలోకి మందకృష్ణను ఆహ్వానిస్తే, తనదగ్గరే 25కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నారు.

కోర్టుకెళ్తా..

ప్రపంచంలోనే అత్యంత అవినీతి జరుగుతున్న దేశం ఇండియా అని అన్నారు కేఏపాల్. తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీకి సింబల్ ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో తాను తెలంగాణ హై కోర్టుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆరోపించారు పాల్. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ తరపున 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులున్నారని, తమకు ఉమ్మడి గుర్తు కేటాయించాలన్నారు. తమకి గుర్తు ఇవ్వకపోతే ప్రజలెవరూ ఓటింగ్ లో పాల్గొనద్దని పిలుపునిచ్చారు పాల్.

First Published:  13 Nov 2023 12:33 PM GMT
Next Story