Telugu Global
Telangana

ఫ్రీ బస్సు ప్రయాణం రద్దు కాబోతోందా..?

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తోంది.

ఫ్రీ బస్సు ప్రయాణం రద్దు కాబోతోందా..?
X

తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి మంచి స్పందన వచ్చింది. మహిళలతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆక్యుపెన్సీ రేటుతో పాటు, ఆర్టీసీకి ఆదాయం కూడా మునుపెన్నడూ లేనంత పెరిగింది. అయితే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని నాగోల్‌కి చెందిన ఓ ప్రైవేట్‌ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికారం రాష్ట్రానికి లేదని ఆయన పిటిషన్ వేశారు. జీవో నంబర్‌ 47ను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

తన పిల్‌లో రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు ఆర్టీసీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ప్రతివాదులుగా చేర్చారు. ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో నిండిపోతున్నాయి. రద్దీ వల్ల సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. పురుషులకు సీట్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. మహిళల రద్దీ కారణంగా టికెట్లు కొని వెళ్లే పురుష ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం త్వరలో విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తోంది. ఈ పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తున్నప్పటికీ బస్సుల కొరత ఇబ్బందికరంగా మారింది. అటు ఆటో డ్రైవర్ల నుంచి కూడా మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇదే సమయంలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపేయాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

First Published:  18 Jan 2024 1:52 PM GMT
Next Story