Telugu Global
Telangana

తెలంగాణలో జిల్లాలు 18.. రేవంత్ నిర్ణయం ఇదేనా..!

పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తలు వస్తున్నాయి. 17 పార్లమెంట్ స్థానాలతో పాటు హైదరాబాద్‌లో కొత్తగా మరో జిల్లా ఏర్పాటుతో 18కి జిల్లాల సంఖ్యను కుదిస్తారని చర్చ నడుస్తోంది.

తెలంగాణలో జిల్లాలు 18.. రేవంత్ నిర్ణయం ఇదేనా..!
X

తెలంగాణలో జిల్లాల సంఖ్యపై మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో 33 జిల్లాలు ఎందుకని.. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కోసం జ్యుడిషియల్‌ కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమే ఈ చర్చకు కారణం. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా.. గత ప్రభుత్వం అడ్డగోలుగా, పద్ధతి పాటించకుండా జిల్లాలను విభజించిందన్నారు రేవంత్ రెడ్డి.

సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు జిల్లాల సంఖ్య తగ్గిస్తారన్న ప్రచారం మొదలైంది. పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తలు వస్తున్నాయి. 17 పార్లమెంట్ స్థానాలతో పాటు హైదరాబాద్‌లో కొత్తగా మరో జిల్లా ఏర్పాటుతో 18కి జిల్లాల సంఖ్యను కుదిస్తారని చర్చ నడుస్తోంది.

ములుగు, జగిత్యాల, వనపర్తి, నారాయణపేట, గద్వాల లాంటి జిల్లాలు విస్తీర్ణంలో చాలా చిన్నవి. కొన్నిచోట్ల రెండు నియోజకవర్గాలకు కలిపి ఒక జిల్లా, మరో చోట ఒక నియోజకవర్గం జిల్లాగా ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి జిల్లాలను ఎత్తేసే అవకాశాలున్నాయంటున్నాయి ప్రభుత్వవర్గాలు. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 అని అందుకే ఆయన 33 జిల్లాలు ఏర్పాటు చేశారని.. ఇప్పుడు రేవంత్ లక్కీ నంబర్‌ 9 అని అందుకే ఆయన జిల్లాల సంఖ్యను 18కి కుదించే ప్రయత్నాలు చేస్తున్నారన్న మరో చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది.

అయితే ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు లాంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడం, జిల్లా కేంద్రాల సమీపంలో ఉన్న భూముల రేట్లు కూడా పెరగడంతో.. ఇప్పుడు పునర్‌వ్యవస్థీకరణ పేరిట జిల్లాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ విషయంలో ఘాటుగానే స్పందించారు.

First Published:  10 Jan 2024 5:38 AM GMT
Next Story