Telugu Global
Telangana

బీజేపీ, కాంగ్రెస్‌ది అబద్దపు ప్రచారం.. తెలంగాణపై అప్పుల భారం తక్కువే : బీఆర్ఎస్ పార్టీ

గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలో అన్ని పెద్ద రాష్ట్రాలు చెల్లించిన వడ్డీ, అప్పులను పరిశీలిస్తే.. తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది అత్యంత తక్కువ అని గతంలోనే కాగ్, ఆర్బీఐ ఒక నివేదికలో తెలిపాయి.

బీజేపీ, కాంగ్రెస్‌ది అబద్దపు ప్రచారం.. తెలంగాణపై అప్పుల భారం తక్కువే : బీఆర్ఎస్ పార్టీ
X

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ అబద్దపు ప్రచారం చేస్తోందని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం మొదలుపెట్టిందని అధికార బీఆర్ఎస్ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వంపై అప్పులు, వడ్డీల భారం భారీగా పెరిగిందని.. వడ్డీల చెల్లింపు, అప్పుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అప్పులు, వడ్డీలపై చేసిన ఖర్చు రూ.15,220 కోట్లని బీఆర్ఎస్ తెలిపింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయంలో 8 శాతం మాత్రమే అని స్పష్టం చేసింది.

దేశంలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలో అన్ని పెద్ద రాష్ట్రాలు చెల్లించిన వడ్డీ, అప్పులను పరిశీలిస్తే.. తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది అత్యంత తక్కువ అని గతంలోనే కాగ్, ఆర్బీఐ ఒక నివేదికలో పేర్కొన్నాయి. బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక కంటే తెలంగాణ చెల్లిస్తున్న అప్పుల శాతం తక్కువ అని ఆ నివేదిక పేర్కొన్నది. పశ్చిమ బెంగాల్ అత్యధికంగా తమ ఆదాయంలో 16 శాతం అప్పులు, వడ్డీల నిర్వహణకే ఖర్చు పెడుతోంది. గుజరాత్ 12 శాతం, యూపీ 9 శాతం, మధ్యప్రదేశ్ 8 శాతం, కర్ణాటక 11 శాతం, మహారాష్ట్ర 10 శాతం మేర ఖర్చు చేస్తున్నాయి.

ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రూ.9.4 లక్షల కోట్లను అప్పులు, వడ్డీల కింద చెల్లిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 23.8 శాతంగా ఆర్బీఐ పేర్కొన్నది. ఈ లెక్కలన్నింటినీ పక్కన పెట్టి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం తెలంగాణ అప్పుల్లో కూరుకొని పోయిందని అబద్దపు ప్రచారం చేస్తున్నాయని.. కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతున్నాయని బీఆర్ఎస్ మండిపడింది. కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ రెండు పార్టీలు చేస్తున్న అబద్దపు ప్రచారానికి వంత పాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇలాంటి అబద్దాల ద్వారా ప్రజలను తప్పదోవ పట్టించడం మానుకోవాలని కోరింది. సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని.. బీఆర్ఎస్ పేర్కొన్నది. ఈ మేరకు శనివారం వరుసగా ట్వీట్లు చేసింది.


First Published:  4 March 2023 5:37 AM GMT
Next Story