Telugu Global
Telangana

నాకు ఏ సాయం వద్దు.. రోడ్లపైనే ఉంటా.. షికాగోలో హైదరాబాద్ యువతి కేసులో ట్విస్ట్

సీజీఐ వెంటనే కొంత మంది సిబ్బందిని పంపించి.. లూలూ జైదిని కాపాడటానికి ప్రయత్నించింది. అయితే వారి సాయాన్ని జైది తిరస్కరించింది.

నాకు ఏ సాయం వద్దు.. రోడ్లపైనే ఉంటా.. షికాగోలో హైదరాబాద్ యువతి కేసులో ట్విస్ట్
X

అమెరికాలో ఎంఎస్ చేయడానికి రెండేళ్ల క్రితం వెళ్లిన హైదరాబాద్‌లోని మౌలాలికి చెందిన యువతి.. మతిస్థిమితం కోల్పోయి ప్రస్తుతం షికాగో రోడ్లపై సంచరిస్తున్న సంగతి తెలిసిందే. షికాగో రోడ్లపై తిరుగుతూ, ఎవరైనా ఆహారం పెడితే తింటూ యువతి సయిదా లూలూ మిన్హాజ్ జైది అక్కడే ఉంటోంది. ఆమె దీనస్థితిని ఇద్దరు హైదరాబాదీ యువకులు వీడియో తీసి పోస్టు చేయడంతో విషయం వైరల్ అయ్యింది. హైదరాబాద్ ఎంబీటీ పార్టీకి చెందిన అంజద్ ఉల్లా ఖాన్.. కేంద్ర మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో విదేశాంగ శాఖ వెంటనే షికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సీజీఐ)కు తెలియజేసింది.

సీజీఐ వెంటనే కొంత మంది సిబ్బందిని పంపించి.. లూలూ జైదిని కాపాడటానికి ప్రయత్నించింది. అయితే వారి సాయాన్ని జైది తిరస్కరించింది. తాను ఇలా రోడ్లపైనే ఉంటానని.. తనకు ఎవరి సాయం అవసరం లేదని చెప్పేసింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని.. బలవంతంగా తరలిస్తే ఎదైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఉందని సీజీఐ అధికారులు తెలిపారు. లూలూ జైదిని దగ్గరలోని ఆసుపత్రికి లేదా షెల్టర్‌కు లేదా ఎవరైనా ఇంటికి తరలించడానికి ప్రయత్నిస్తే ఆమె తీవ్రంగా ప్రతిఘటించినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం జైదీ రోడ్లపైనే ఉంటుంది. అయితే ఆమెను నిరంతరాయం సీజీఐ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 8 గంటలకు ఒకరి చొప్పున ముగ్గురు ఆమెను దూరం నుంచి గమనిస్తూ ఉన్నారని సీజీఐ పేర్కొన్నది. ఇది చాలా సున్నితమైన వ్యవహారమని.. సీజీఐ ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నది.. అలాగే తాము కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని లేక్ షోర్ ముస్లిమ్ సెంటర్ ప్రెసిడెంట్ మహ్మద్ మిన్హాజ్ అక్తర్ తెలిపారు.

సోమవారం లూలూ జైదితో తల్లి సయిదా ఫాతిమా వీడియో కాల్‌లో మాట్లాడారు. కాగా, తాను యూఎస్ వెళ్లి కూతురిని తిరిగి ఇండియాకు తీసుకొని రావడానికి సాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ను అభ్యర్థించారు. ఎంబీటీ లీడర్ అంజద్ ఖాన్ కూడా ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లారు. తల్లికి పాస్‌పోర్టు రాగానే.. వీసా తీసుకొని వెళ్లి.. లూలూ జైదిని వెనక్కు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.

First Published:  1 Aug 2023 4:33 AM GMT
Next Story