Telugu Global
Telangana

జీవ వైవిధ్యంలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం, చెరువుల సంరక్షణ-బలోపేతం, అడవుల పెంపకం, అర్భన్ లంగ్ స్పేసెస్ వంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల నగరంలో జీవ వైవిధ్యం కొనసాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

జీవ వైవిధ్యంలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : మంత్రి కేటీఆర్
X

- హైదరాబాద్ బయోడైవర్సిటీ ఇండెక్స్ విడుదల చేసిన కేటీఆర్

- జీవ వైవిధ్యాన్ని రెండో సారి మదింపు చేసిన ఏకైక నగరం

జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ)లో హైదరాబాద్ నగరం తొమ్మిదేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా మారే క్రమంలో జీవ వైవిధ్యం అత్యంత కీలకమైన అంశమని మంత్రి అభిప్రాయపడ్డారు. జీవించు-జీవించనివ్వు అనే స్పూర్తిని ఆధారంగా తీసుకొని నగరీకరణ జరిగినప్పుడే ప్రకృతితో మమేకమై బతకగలిగే పరిస్థితి ఉంటుందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరం కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన జీవ వైవిధ్య సూచీ నివేదికను మంగళవారం మంత్రి విడుదల చేశారు. ఈ నివేదికను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం, చెరువుల సంరక్షణ-బలోపేతం, అడవుల పెంపకం, అర్భన్ లంగ్ స్పేసెస్ వంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల నగరంలో జీవ వైవిధ్యం కొనసాగుతోందని అన్నారు. బయోడైవర్సిటీకి ఈ పనులన్నీ ఎంతగానో ఉపయోగపడ్డాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పనుల కారణంగా నగరంతో పాటు.. భవిష్యత్‌లో చుట్టు పక్కల కూడా బయో డైవర్సిటీ మరింతగా పెరుగుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యాన్ని కేవలం నగరానికే పరిమితం చేయకుండా.. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హరిత హారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీంతో పాటు పట్టణ ప్రగతి వనాలు, నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామని.. వీటన్నింటి కోసం గ్రీన్ బడ్జెట్ కూడా కేటాయించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. బయో డైవర్సిటీ కోసం తెలంగాణ చేపట్టిన చర్యల కారణంగా ఇటు పట్టణాల్లోనే కాకుండా, అటు గ్రామాల్లో కూడా చక్కని ఫలితాలు చూపిస్తోందని అన్నారు. ఈ విభాగంలో ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలకు అవార్డులు కూడా లభించాయని తెలిపారు.

రాష్ట్రంలో జీవ వైవిధ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని.. అందుకే పట్టణాభివృద్ధి శాఖ ఐదు ఏళ్ల పాటు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. జూన్ 5న రాష్ట్ర మంతటా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి.. ప్రజల్లో బయో డైవర్సిటీపై అవగాహన పెంచాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఆ రోజు పట్టణాల్లో హరితాన్ని అభివృద్ధి చేసిన మున్సిపాలిటీలు, సిబ్బందికి అవార్డులు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

దేశంలో ఏకైక నగరం హైదరాబాద్..

బయోడైవర్సిటీ సూచీకి సంబంధించిన నివేదికను ఇండియాలో రెండో సారి మదింపు చేసిన ఏకైక నగరం హైదరాబాద్ అని మంత్రి వెల్లడించారు. 2012లో మొదటి సారి హైదరాబాద్, 2017లో కోల్‌కతా నగరాలు బయో డైవర్సిటీ మదింపును చేపట్టాయి. ఇక ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రెండో సారి బయోడైవర్సిటీ ఇండెక్స్‌ను రూపొందించిన నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఇక్కడ ఉన్న జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యవేక్షణ, అభివృద్ధికి ఈ బయోడైవర్సిటీ ఇండెక్స్ ఎంతగానో ఉపయోగపడనున్నది. ఈ విషయంలో సహకరించిన సింగపూర్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఈ ఇండెక్స్‌ను సింగపూర్ ఇండెక్స్ పేరుతో పిలుస్తున్నట్లు చెప్పారు.

నగర జీవ వైవిద్య సూచీ కోసం ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న జీవ వైవిధ్య సంరక్షణ ప్రయత్నాలు, స్థానిక ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం, జీవవైవిధ్య వృద్ధి కోసం రూపొందించిన మార్గదర్శకాలు.. వంటి మెత్తం 23 రకాల అంశాలను కొలమానంగా తీసుకున్నారు. అన్ని అంశాలకు సంబంధించి 92 మార్కులు కేటాయించగా.. జీహెచ్ఎంసి ఈ బయోడైవర్సిటీ ఇండెక్స్ కోసం జరిపిన అధ్యయనంలో 57 మార్కులను సాధించింది. 2012లో నగరంలో అప్పుడు జరిపిన బయోడైవర్సిటీ ఇండెక్స్ అధ్యయనంలో కేవలం 36 మార్కులు మాత్రమే లభించగా.. గత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గణనీయమైన అభివృద్ధి సాధించి ఈ సారి 21 మార్కులు ఎక్కువగా సాధించింది.

సరస్సుల నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో ప్రస్తుతం దాదాపు రెండు వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న 1350కి పైగా జల వనరులు, 1600 హెక్టార్లలో విస్తరించిన సహజ రాళ్లగుట్టలు (రాక్ ఫార్మేషన్స్), నగరంలో ఉన్న రెండు జాతీయ పార్కులు(కేబీఆర్‌తో పాటు హరిణి వనస్థలి).. జీవవైవిధ్యానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఈ నివేదికలో స్పష్టమైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్రిసాట్ వంటి సంస్థలకు ఉన్న సువిశాలమైన క్యాంపస్ లు జీవ వైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నాయని తేలింది. హైదరాబాద్ నగరానికి ఉన్న సహజ సిద్ధమైన జీవ వైవిధ్య వనరులను పరిరక్షించడం ద్వారా నగర బయో డైవర్సిటీ సూచీలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు అవకాశం కలిగింది.

ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో 1305 వృక్షజాతులు ఉండగా, 577 ప్రాంతీయ వృక్ష జాతులు, 728 ఇతర ప్రాంత వృక్ష జాతులు నగరంలో ఉన్నట్లు స్పష్టమైంది. 30 రకాల తూనీగ జాతులు (odonates), 141 జాతుల సీతాకోక చిలుకలు, 42 రకాల సాలీడు పురుగులు, 60 రకాల చేపలు, 16 రకాల (amphibians) ఉభయచర జాతులు, 41 రకాల సరీసృపాలు, 315 పక్షి జాతులు, 58 క్షీరదాలు (mammalian) ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది.

First Published:  18 April 2023 3:32 PM GMT
Next Story