Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో ఎంతమంది సీఎంలు..?

లీడర్ల కోరికలు ఎలా ఉన్నా ప్రస్తుతం సీఎం అభ్యర్థి రేసులో పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ తర్వాత దళిత కోటాలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్కకు అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కాంగ్రెస్‌లో ఎంతమంది సీఎంలు..?
X

తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఐదారుగురు సీఎం అయ్యేది తామే అని భావిస్తున్నారు. తాజాగా లిస్ట్‌లో జాయిన్ అయిపోయారు మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్. ఓ నేషనల్ మీడియా నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్‌లో పాల్గొన్న మధుయాష్కీ... తాను కూడా సీఎం రేసులో ఉన్నట్లు ప్రకటించుకున్నారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు చాలామందే ఉన్నారు ఇంతకీ మీ అభ్యర్థి ఎవరు అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అయితే నేనేందుకు సీఎం కాకూడదు అంటూ తన మనసులోని మాటను చెప్పకనే చెప్పారు మధుయాష్కీ.

ఇక ఇప్పటికే సీనియర్ లీడర్ జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమకు సీఎం కావాలని ఉందనే కోరికను బాహాటంగానే ప్రకటించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అయితే ఈ మధ్య ఎప్పుడు చూసినా సీఎం పదవిని ఉద్దేశించే వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు ఇప్పుడే సీఎం కావాలని లేకున్నా భవిష్యత్తులో కచ్చితంగా సీఎం అవుతానంటూ ప్రకటనలు చేస్తున్నారు. అటు జగ్గారెడ్డి సైతం దసరా పండుగ సందర్భంగా తనకు సీఎం కావాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా సీఎం అవుతాననే ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ లీడర్ జానారెడ్డి సైతం తను అన్ని పదవులు అనుభవించాను.. ఇక అదే బ్యాలన్స్ ఉందంటూ సీఎం పోస్టును ఉద్దేశించి అప్పట్లో వ్యాఖ్యలు చేశారు.

లీడర్ల కోరికలు ఎలా ఉన్నా ప్రస్తుతం సీఎం అభ్యర్థి రేసులో పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ తర్వాత దళిత కోటాలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్కకు అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీతక్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలా కాంగ్రెస్‌లో ఎవరికివారే సీఎంలా ఫీల్ అయిపోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పెరుగుతున్న సీఎం అభ్యర్థుల లిస్టు అధిష్టానానికి ఆందోళన కలిగిస్తోంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడంపై దృష్టి పెట్టకుండా ఇప్పటి నుంచే సీఎం కుర్చీ కోసం ఈ ఆరాటం ఏంటోనని గుర్రుగా ఉన్నారట ఢిల్లీ పెద్దలు.

First Published:  10 Nov 2023 2:16 AM GMT
Next Story