Telugu Global
Telangana

ఆయన కోసం.. మొదటిసారి హీరో వెంకటేష్ ప్రచారం!

హీరో వెంకటేష్‌తో ప్రచారం చేయించేందుకు షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పడ్డారు రఘురాంరెడ్డి. వెంకటేష్ ప్రచారం మరింత కలిసి వస్తుందన్న భావనలో పొంగులేటి, రఘురాంరెడ్డి వర్గీయులు ఉన్నారు.

ఆయన కోసం.. మొదటిసారి హీరో వెంకటేష్ ప్రచారం!
X

ఖమ్మం పార్లమెంట్‌లో పొలిటికల్ సినిమా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపు కోసం అటు మంత్రి పొంగులేటి, ఇటు హీరో వెంకటేష్ ప్రచారానికి రంగంలోకి దిగుతున్నారు. హీరో వెంకటేష్‌ కుమార్తె అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్‌ రెడ్డి వివాహం చేసుకున్నారు. అంతేకాదు.. రఘురాంరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి కూడా వియ్యంకుడే. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని రఘురాంరెడ్డి చిన్న కుమారుడు అర్జున్‌ రెడ్డి వివాహమాడారు. ఈ విధంగా రఘురాంరెడ్డి ఇటు వెంకటేశ్‌కి, అటు మంత్రి పొంగులేటికి వియ్యంకుడు అయ్యారు.

వెంకటేష్‌ షెడ్యూల్‌ కోసం వెయిటింగ్‌..

హీరో వెంకటేష్‌తో ప్రచారం చేయించేందుకు షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పడ్డారు రఘురాంరెడ్డి. వెంకటేష్ ప్రచారం మరింత కలిసి వస్తుందన్న భావనలో పొంగులేటి, రఘురాంరెడ్డి వర్గీయులు ఉన్నారు. ఈ రకంగా వియ్యంకుడి కోసం వెంకటేష్ మొదటిసారి ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కేవలం ఖమ్మం పార్లమెంట్‌ వరకే వెంకీ ప్రచారం ఉంటుందని తెలుస్తోంది.

రెబల్స్‌కు బుజ్జగింపులు..

మరోవైపు నేటి నుంచి ఖమ్మం పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ‌ వ్యాప్తంగా పొంగులేటి పర్యటనలు చేపడుతున్నారు. కాంగ్రెస్ రెబల్స్‌ను బుజ్జగించేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే పోట్ల నాగేశ్వర్ రావు, రాయల నాగేశ్వర్ రావు, నాగ సీతారాములు కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు. ఇదిలా ఉంటే భార్య నందినికి టికెట్ కోసం గట్టిగా ట్రై చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. రఘురాంరెడ్డి నామినేషన్‌కు కూడా భట్టి దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో భట్టిని పొంగులేటి బుజ్జగిస్తారా?. రాఘురాంరెడ్డి గెలుపున‌కు భట్టి సహకరిస్తారా?. అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

First Published:  26 April 2024 5:23 AM GMT
Next Story