Telugu Global
Telangana

మూడు రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నది.

మూడు రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్
X

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ రోజు కూడా హైదరాబాద్ నగరం సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. హైదరాబాద్‌లో ఒక మోస్తరు వర్షం పడుతుందని.. ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నది. అంతే కాకుండా దీనికి అనుబంధంగా వాయుగుండం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. దీంతో రాష్ట్రంలో ఒక మోస్తరు గాలులు పశ్చిమం నుంచి వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గురువారం అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. నగరంలోని ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, సనత్‌నగర్, బోరబండి, ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో వర్షం పడింది.

రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం కూడా ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండటం, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లో తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవవచ్చు. ఇక అక్టోబర్ 6 నుంచి 12వ తేదీ మధ్యలో రాష్ట్రానికి నైరుతీ రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.


First Published:  22 Sep 2023 4:55 AM GMT
Next Story