Telugu Global
Telangana

హరీష్ రావు వ్యాఖ్యలతో రగిలిపోతున్న వైసీపీ నేతలు..

టీడీపీ అనుకూల మీడియా ఈ పాయింట్ ని క్యాచ్ చేసింది. వైసీపీ పాలనపై పొరుగు రాష్ట్రాల మంత్రులు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో చూడండి అంటూ రచ్చ చేసింది. దీంతో వైసీపీ నేతలకు రోషమొచ్చింది

హరీష్ రావు వ్యాఖ్యలతో రగిలిపోతున్న వైసీపీ నేతలు..
X

గతంలో ఏపీ ఉద్యోగుల గురించి తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు మంట పుట్టించాయి. అప్పట్లో విమర్శలు, ప్రతి విమర్శలతో కొన్నాళ్లు ఆ ఎపిసోడ్ నడిచింది. మళ్లీ ఇప్పుడు వైజాగ్ స్టీల్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ దశలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఆయన చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు రగిలిపోతున్నారు.

ఇంతకీ హరీష్ రావు ఏమన్నారు..?

సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. భవన నిర్మాణ కార్మికులను తెలంగాణ ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటోందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే వలస కార్మికులు కూడా తెలంగాణలో ఉండటానికే ఇష్టపడుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఏపీతో పోలిక చెప్పారు. "ఏపీలో రోడ్లు, అక్కడి ఆస్పత్రులు చూశారు కదా, తెలంగాణ పరిస్థితి కూడా చూశారు కదా.. రెండిటికీ ఎంత తేడా ఉందో మీకు తెలుసుకదా" అన్నారు. ఏపీలో మీకు ఓటు హక్కు ఉంటే దాన్ని రద్దు చేసుకుని ఇక్కడికే వచ్చి ఉండండి. ఇక్కడే శాశ్వతంగా ఉండండి, ఇక్కడి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందండి అంటూ సూచించారు హరీష్ రావు.

వాస్తవానికి హరీష్ ఎక్కడా ఏపీని కించపరచలేదు, తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం బాగుంది, మీరు ఇక్కడే ఉండండి అంటూ ఆయన కార్మికులకు సూచించారు. అయితే టీడీపీ అనుకూల మీడియా ఈ పాయింట్ ని క్యాచ్ చేసింది. వైసీపీ పాలనపై పొరుగు రాష్ట్రాల మంత్రులు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో చూడండి అంటూ రచ్చ చేసింది. దీంతో వైసీపీ నేతలకు రోషమొచ్చింది. మా పాలన బాగాలేదంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే వైజాగ్ స్టీల్ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. హరీష్ మాటలు, దానికి ఓ వర్గం మీడియా ఇచ్చిన ఎలివేషన్ వల్ల మళ్లీ మాటల తూటాలు పేలేలా ఉన్నాయి.

First Published:  12 April 2023 4:59 AM GMT
Next Story