Telugu Global
Telangana

రేవంత్‌ను వణికిస్తున్న హరీశ్‌రావు.. సీఎం ముందు 2 డిమాండ్లు!

ఆర్థిక భారంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని హరీశ్‌ అన్నారు. అందువల్ల రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పట్లోగా చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.

రేవంత్‌ను వణికిస్తున్న హరీశ్‌రావు.. సీఎం ముందు 2 డిమాండ్లు!
X

రైతులకు తక్షణమే రూ.2లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్ర‌భుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారని, నాలుగు నెలలవుతున్నా ఒక్క రైతుకు కూడా రుణం మాఫీ కాలేదని విమర్శించారు. రైతులకు బ్యాంకులు నోటీసుల మీద నోటీసులు ఇస్తూ కిస్తీ చెల్లిచాలంటున్నాయని, తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాయని చెప్పారు. ఆర్థిక భారంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని హరీశ్‌ అన్నారు. అందువల్ల రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పట్లోగా చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.

లేఖలో హరీశ్‌రావు ఏం రాశారంటే..."కేసీఆర్‌ నాయకత్వంలో రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు రూ.లక్ష చొప్పున 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది. ఏ ఒక్క బ్యాంకు కూడా రుణాలు చెల్లించాలని ఎప్పుడూ రైతులపై ఒత్తిడి తేలేదు. లక్ష రూపాయల వరకు రైతులకు సంబంధించిన రుణాలను మేమే కడతామని బ్యాంకర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు హామీ ఇచ్చింది. దాని ప్రకారమే ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు చెల్లింపులు చేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా రుణమాఫీ పొందగలిగారు. కానీ, రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధానమూ ప్రకటించకపోవడం, ఈ బడ్జెట్ లో రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం వల్ల రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

"రుణమాఫీపై ప్రభుత్వం నేటివరకు అటు బ్యాంకర్లకు కానీ, ఇటు రైతులకు కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రుణాలు మేమే చెల్లిస్తామని, రైతులపై ఒత్తిడి తేవొద్దని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించలేదు. ఎవరైనా రైతులు వడ్డీ భారం పడకుండా రుణాలు చెల్లిస్తే వారికి ప్రభుత్వం తిరిగి నగదు ఇస్తుందా, లేదా? అనే విషయంపైనా స్పష్టత లేదు. ఈ అనిశ్చితి గ్రామాల్లో రైతులకు, బ్యాంకర్ల మధ్య చిచ్చు పెడుతోంది. స్థానిక బ్యాంకు మేనేజర్లకు వారి ఉన్నతాధికారుల నుంచి లోన్ రికవరీ కోసం నోటీసులు వస్తున్నాయి. దీంతో వారు రైతుల మీద పడుతున్నారు".

"కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయకపోవడం వల్ల వారు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందక, పంటలు ఎండిపోయి, సకాలంలో నీళ్లు అందక, నాలుగు నెలల్లోనే 209 మంది రైతులు చనిపోయారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లకు, వేధింపులకు తట్టుకోలేక రైతులు ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రుణమాఫీ విషయంలో సీఎం తక్షణం స్పందించాలి. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలి. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలి" అని లేఖలో డిమాండ్‌ చేశారు హరీశ్‌రావు.

First Published:  3 April 2024 7:14 AM GMT
Next Story