Telugu Global
Telangana

తెలంగాణ పర్యాటక శాఖ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం

అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్, ఫర్నిచర్, కంప్యూటర్లు.. అన్నీ తగలబడిపోయాయి. అదే ఆఫీస్ కింద పార్కింగ్ చేసి ఉన్న రెండు కార్లు కూడా ఈ అగ్నికీలలకు ఆహుతయ్యాయి.

తెలంగాణ పర్యాటక శాఖ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం
X

హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఉన్న తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు ఝామున 3 గంటల ప్రాంతంలో ఆఫీస్ మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు చెబుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్, ఫర్నిచర్, కంప్యూటర్లు.. అన్నీ తగలబడిపోయాయి. అదే ఆఫీస్ కింద పార్కింగ్ చేసి ఉన్న రెండు కార్లు కూడా ఈ అగ్నికీలలకు ఆహుతయ్యాయి.

తెలంగాణలో నిన్న ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న స్టాఫ్ కి ఈరోజు కూడా సెలవు ఇచ్చారు. ఈనెల 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యాలయాల్లో సిబ్బంది హాజరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. తాజాగా జరిగిన అగ్నిప్రమాదంలో కీలక ఫైల్స్, కంప్యూటర్లు అన్నీ తగలబడి పోవడంతో కలకలం రేగింది. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణం అని ప్రాథమికంగా తేలినా.. లోతైన దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇటీవలే ఎండీ సస్పెండ్.. ఇంతలోనే

ఇటీవల పర్యాటక శాఖ ఎండీ మనోహర్, ఆయన ఓఎస్డీ సత్యనారాయణపై ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న కారణంగా వారిద్దర్నీ సస్పెండ్ చేశారు. ఇప్పుడు వారి కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం విశేషం.

First Published:  1 Dec 2023 12:53 PM GMT
Next Story