Telugu Global
Telangana

తెలంగాణ అసెంబ్లీ బ‌రిలో హైద‌రాబాద్ మేయ‌ర్లు

గ్రేట‌ర్ మేయ‌ర్‌గా అధ్య‌క్ష స్థానంలో కూర్చున్న వీరిద్ద‌రూ రేపు ఎన్నిక‌ల్లో గెలిచి అసెంబ్లీలో అధ్య‌క్షా అనాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ బ‌రిలో హైద‌రాబాద్ మేయ‌ర్లు
X

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్లుగా పని చేసిన ఇద్ద‌రు అభ్య‌ర్థులు ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ అదృష్టం ప‌రీక్షించుకోబోతున్నారు. మీర్ జుల్ఫిక‌ర్ అలీ చార్మినార్ నుంచి, మ‌హ్మ‌ద్ మాజిద్ హుస్సేన్ నాంప‌ల్లి నుంచి మ‌జ్లిస్ పార్టీ అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగుతున్నారు. గ్రేట‌ర్ మేయ‌ర్‌గా అధ్య‌క్ష స్థానంలో కూర్చున్న వీరిద్ద‌రూ రేపు ఎన్నిక‌ల్లో గెలిచి అసెంబ్లీలో అధ్య‌క్షా అనాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.

చార్మినార్ నుంచి మీర్ జుల్ఫిక‌ర్

గ్రేట‌ర్ హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో రెండుసార్లు మేయ‌ర్‌గా ప‌నిచేసిన ఏకైక వ్యక్తిగా మీర్ జుల్ఫిక‌ర్ అలీ రికార్డు సృష్టించారు. మ‌జ్లిస్ త‌ర‌ఫున హ‌స్సేనీ ఆలం నుంచి కార్పొరేట‌ర్‌గా గెలిచిన జుల్ఫిక‌ర్ అలీ 1991 నుంచి 1995 వ‌ర‌కు, 1999 నుంచి 2002 వ‌ర‌కు రెండు ప‌ర్యాయాలు మొత్తం ఏడేళ్లు హైదరాబాద్ మేయ‌ర్‌గా ప‌ని చేసి అత్య‌ధిక కాలం న‌గ‌ర ప్ర‌థ‌మ పౌరుడి హోదాను అనుభ‌వించారు. చార్మినార్‌లో సిటింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌ను ప‌క్క‌న‌పెట్టి మరీ మ‌జ్లిస్ పార్టీ జుల్ఫిక‌ర్ అలీకి ఈసారి టికెటిచ్చింది.

నాంప‌ల్లి నుంచి మహ్మద్ మాజిద్ హుస్సేన్

చిన్న వ‌య‌సులోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎంబీఏ చ‌దివిన మాజిద్ హుస్సేన్ 29 ఏళ్ల‌కే 2009లో మజ్లిస్ పార్టీ తరపున అహ్మద్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేట‌ర్‌గా గెలిచారు. 2012- 14 వరకు రెండేళ్ల‌పాటు న‌గర మేయర్‌గా కొనసాగారు. 2016, 2020ల్లో మెహిదీపట్నం డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఇప్పుడు నాంప‌ల్లి టికెట్ ద‌క్కించుకున్నారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అయ్యారు

2002 నుంచి 2007 వ‌ర‌కు మేయర్‌గా ప‌ని చేసిన తీగ‌ల కృష్ణారెడ్డి త‌ర్వాత మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యేగా గెలిచారు. అంత‌కు ముందు 1960వ ద‌శ‌కంలో మేయ‌ర్‌గా ప‌ని చేసిన స‌రోజిని పుల్లారెడ్డి 1967, 1972ల‌లో రెండుసార్లు మ‌ల‌క్‌పేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె చాలాకాలం మంత్రిగానూ ప‌నిచేశారు. తెలంగాణ రాజ‌కీయాల్లో పేరెన్నిక‌గ‌న్నారు. బండ కార్తీక‌రెడ్డి లాంటి ప‌లువురు మేయ‌ర్లు మాత్రం ఎంత ప్ర‌య‌త్నించినా అసెంబ్లీ గ‌డ‌ప తొక్క‌లేక‌పోయారు. ఈసారి మ‌జ్లిస్ త‌ర‌ఫున పోటీచేస్తున్న‌ మాజీ మేయ‌ర్ల అదృష్టం ఎలా ఉందో చూడాలి.

First Published:  4 Nov 2023 6:16 AM GMT
Next Story