Telugu Global
Telangana

పైరవీకారులు లేకుండానే.. నేరుగా లబ్దిదారులకే డబుల్ బెడ్రూం ఇళ్లు : మంత్రి హరీశ్ రావు

ఒక్క రూపాయి ఖర్చు కాకుండా.. పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లను కేసీఆర్ ప్రభుత్వం కట్టించి ఇస్తోందన్నారు.

పైరవీకారులు లేకుండానే.. నేరుగా లబ్దిదారులకే డబుల్ బెడ్రూం ఇళ్లు : మంత్రి హరీశ్ రావు
X

పైరవీకారులతో పని లేకుండానే నేరుగా లబ్దిదారులకే డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరుగుతున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల చేతుల మీదుగా నిజమైన లబ్దిదారులను గుర్తించి.. వారికే ఇళ్ల కాగితాలు అందిస్తున్నామని మంత్రి చెప్పారు. మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలం రామతీర్థంలో కొత్తగా నిర్మించిన 56 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి ప్రారంభించారు. లబ్దిదారులకు ఇంటి పేపర్లను అందించిన అనంతరం మాట్లాడుతూ..

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అనే మాట ఊరికనే అనలేదు. ఇల్లు కట్టాలంటే ఎంతో ప్రయాస పడాలి. కానీ ఒక్క రూపాయి ఖర్చు కాకుండా.. పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లను కేసీఆర్ ప్రభుత్వం కట్టించి ఇస్తోందన్నారు. పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో పైరవీకారులకు చోటే లేదని అన్నారు. ఈ నెలాఖరులోగా ఇంటి జాగా ఉన్న వారికి గృహ లక్ష్మి పథకం ద్వారా ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని అన్నారు.

బోరు బాయి దగ్గర మీటర్లు పెట్టి, రైతులకు కరెంటు బిల్లు పంపాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. దీంతో రూ.30వేల కోట్లను కేంద్రం రాకుండా ఆపేసిందని మంత్రి విమర్శించారు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టేది లేదని చెప్పిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు.

కాంగ్రెస్ పాలన తెస్తామని ఆ పార్టీ నాయకులు పదే పదే చెబుతున్నారు. కాంగ్రెస్ పాలన అంటే నీళ్లకు కష్టం, కరెంటుకు కష్టం, పెన్షన్‌కు కష్టమని మంత్రి చెప్పారు. రైతులను ఇంత మంచిగా కేసీఆర్ ప్రేమిస్తున్నాడు. ఇంకా ఎవరైనా ఇలా ప్రేమించగలరా అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా.. ప్రతీ గింజను కేసీఆర్ కొనుగోలు చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. కరోనా కష్టమొచ్చినా, పెద్ద నోట్లు రద్దు అయినా.. రైతులకు కష్టం లేకుండా సీఎం కేసీఆర్ చూసుకున్నారని చెప్పారు.

మెదక్ పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాము. ఆరోగ్య సమస్యలు వస్తే.. హైదరాబాద్‌కు పోయే అవసరమే లేకుండా అన్ని సదుపాయాలు కల్పించామని మంత్రి చెప్పారు. ఈ నెల 14 నుంచి మహిళలకు న్యూట్రిషన్ కిట్లు అందించనున్నట్లు మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

First Published:  5 Jun 2023 11:38 AM GMT
Next Story