Telugu Global
Telangana

హ‌స్తాన్ని వ‌దిలేదే లే అంటున్న‌ జ‌గ్గారెడ్డి.. ఇప్ప‌టి దాకా ఎన్ని పార్టీలు మారారో తెలుసా?

బైబ‌ర్త్ కాంగ్రెస్‌వాదిని అన్న‌ట్లు మాట్లాడే జ‌గ్గారెడ్డి ఎన్ని పార్టీలు మారారో తెలిస్తే షాక‌వ్వాల్సిందే.

హ‌స్తాన్ని వ‌దిలేదే లే అంటున్న‌ జ‌గ్గారెడ్డి..  ఇప్ప‌టి దాకా ఎన్ని పార్టీలు మారారో తెలుసా?
X

తూర్పు జ‌గ్గారెడ్డి.. తెలంగాణ‌లోనే కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ఎక్కువ మందికి తెలిసిన రాజకీయ నాయ‌కుడు. మ‌రీ ముఖ్యంగా టీ కాంగ్రెస్‌లో ఆయ‌న‌దో విల‌క్ష‌ణమైన‌ శైలి. ఫైర్‌బ్రాండ్‌గా పేరుబ‌డ్డ జ‌గ్గారెడ్డి ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల మీదే అగ్గి మీద గుగ్గిల‌మైపోతున్నారు. సొంత పార్టీలోనే త‌న‌కు కుంప‌టి పెడుతున్నార‌ని మండిపడుతున్నారు. తాను కాంగ్రెస్‌లో ఉండొద్దా అని నిల‌దీస్తున్నారు.

బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి..

అయితే బైబ‌ర్త్ కాంగ్రెస్‌వాదిని అన్న‌ట్లు మాట్లాడే జ‌గ్గారెడ్డి ఎన్ని పార్టీలు మారారో తెలిస్తే షాక‌వ్వాల్సిందే. సంగారెడ్డి మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌గా బీజేపీ త‌ర‌ఫున గెలిచి రాజ‌కీయ జీవితం ప్రారంభించిన జ‌గ్గారెడ్డి అక్క‌డే మున్సిప‌ల్ ఛైర్మ‌న్ అయ్యారు. త‌ర్వాత క‌మ‌లాన్ని వ‌దిలి కారెక్కేశారు. టీఆర్ఎస్‌లో చేరి 2004లో సంగారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.

కారు దిగి చేయందుకున్నారు

త‌ర్వాత టీఆర్ఎస్ వ‌దిలి కాంగ్రెస్‌లో చేరారు. 2009లోనూ ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ టైమ్‌లోనే కాంగ్రెస్‌లో బాగా పేరు పొందారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ అంద‌రికీ బాగా నోటెడ్ పొలిటీషియ‌న్‌గా మారారు. కానీ 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోగానే కాంగ్రెస్‌కు టాటా చెప్పేసి, బీజేపీ కండువా కప్పుకున్నారు. ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా మెద‌క్ లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంట‌నే మళ్లీ కాంగ్రెస్‌లోకి వ‌చ్చేశారు. సో ఇద‌న్న మాట క‌థ‌. కాబ‌ట్టి జ‌గ్గారెడ్డి నేను కాంగ్రెస్ వ‌దిలిపోతానా అని క‌ళ్లెర్ర‌జేసినంత మాత్రాన ఆయ‌న మాట‌లేమీ న‌మ్మేయక్క‌ర్లేదు. ఆయ‌న తెలంగాణ‌లో ప్ర‌ధాన‌మైన మూడు రాజ‌కీయ పార్టీల్లోకి ఎప్పుడైనా వెళ్లిపోగ‌ల ఛాన‌ల్ ఉన్న నేతేనంటున్నారు ఆయ‌న రాజ‌కీయ జీవితం తెలిసిన‌వాళ్లు.

First Published:  20 Aug 2023 7:54 AM GMT
Next Story