Telugu Global
Telangana

డీఎస్ పరిస్థితి అత్యంత విషమం..

ప్రస్తుతం హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారాయన. ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

డీఎస్ పరిస్థితి అత్యంత విషమం..
X

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన వయసు 74 సంవత్సరాలు. ప్రస్తుతం హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారాయన. ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.



నిజామాబాద్‌ జిల్లా రాజకీయాలను చాలా కాలం శాసించారు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్). 1983లో కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన డీఎస్, 1989లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. ఆ తర్వాత గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగారు. 1998లో తొలిసారి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అప్పట్లో సీఎం సీటు విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గట్టిపోటీ ఇచ్చారు డీఎస్. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో డీఎస్ ఓటమిపాలయ్యారు డీఎస్. తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆయన సీనియార్టీని గౌరవించి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. గతేడాదితో ఆయన రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. అప్పట్నుంచి ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కి దూరమయ్యారు.

కుటుంబంలో గొడవలు..

ఇటీవల డీఎస్, ఆయన కొడుకు సంజయ్ తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అయితే ఆ మరుసటి రోజే డీఎస్ కాంగ్రెస్ కి రాజీనామా చేస్తున్నట్టు ఓ లేఖ రాశారు. ఈ లేఖతో వ్యవహారం అంతా తారుమారయింది. అసలాయన కాంగ్రెస్ లో చేరలేదని ఆ పార్టీ నేతలు చెబుతుంటే, చేరాననుకుంటే తన రాజీనామాను ఆమోదించండి అంటూ డీఎస్ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆ లేఖ వెనక డీఎస్ మరో కొడుకు, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హస్తం ఉందని సంజయ్ ఆరోపించారు. డీఎస్ మానసిక పరిస్థితి బాగో లేదని అప్పట్లోనే సిటీ న్యూరో ఆస్పత్రి వర్గాలు తేల్చి చెప్పడంతో వ్యవహారం కాస్త చల్లారింది. తిరిగి ఇప్పుడు అనారోగ్యంతో డీఎస్ పేరు వార్తల్లో వినపడుతోంది. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో, కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఆయనతో కలసి పనిచేసిన నేతలు పరామర్శకోసం ఆస్పత్రి వస్తున్నారు.

First Published:  12 Sep 2023 1:40 PM GMT
Next Story