Telugu Global
Telangana

రూ.1,835 కోట్లతో 562 చెక్ డ్యామ్‌ల నిర్మాణం.. త్వరలోనే టెండర్లు

తొలి దశలో ఇప్పటికే 638 చెక్ డ్యామ్‌లను లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 99 శాతం పనులు పూర్తయ్యాయి.

రూ.1,835 కోట్లతో 562 చెక్ డ్యామ్‌ల నిర్మాణం.. త్వరలోనే టెండర్లు
X

తెలంగాణలో సాగు, తాగు నీటి రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఒక వైపు భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతూనే.. చెక్ డ్యామ్‌లను కూడా ఏర్పాటు చేస్తోంది. వర్షాకాలంలో పడే ప్రతీ నీటి బొట్టును జాగ్రత్తగా ఒడిసిపట్టాలనే లక్ష్యంతో చెక్ డ్యామ్‌ల నిర్మాణం జరుపుతున్నది. ఇప్పటికే 130 చెక్‌ డ్యామ్‌లను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి 1,200 చెక్ డ్యామ్‌లను రూ.3,825 కోట్ల వ్యయంతో నిర్మించాలని గతంలోనే నిర్ణయించింది.

తొలి దశలో ఇప్పటికే 638 చెక్ డ్యామ్‌లను లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 99 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి మిగిలిన పెండింగ్ వర్క్స్ పూర్తవుతాయి. ఇక రెండో దశలో రూ.1,835 కోట్లతో 562 చెక్‌ డ్యామ్‌లను నిర్మించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ డ్యామ్‌ల నిర్మాణానికి తగిన అనుమతులు కావాలంటూ రాష్ట్ర సాగు నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ఫైలును పంపింది. అనుమతులు మంజూరు కాగానే టెండర్లు పిలుస్తామని అధికారులు చెప్పారు.

కాగా, ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చిన చెక్ డ్యామ్‌ల పరిధిలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. చెక్ డ్యామ్‌లలో నీళ్లు నిల్వ ఉండటంతో మత్స్యకారులు చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారు. మరోవైపు పంటలకు నీరు కూడా అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. వాటన్నింటికీ పూడిక సమస్య ఎదురవుతున్నది.

చెక్ డ్యామ్‌ల నిర్మాణం వల్ల పూడిక సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. చెరువుల్లో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని అంటున్నారు. రాష్ట్రంలో చెక్ డ్యామ్‌ల కారణంగా ఆయా ప్రాంతాల్లో పచ్చదనం కూడా పెరుగుతోంది. ఇలా అన్ని రకాలుగా చెక్ డ్యామ్‌లు సత్ఫలితాలు ఇస్తుండటంతో ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి చెక్ డ్యామ్‌ల కోసం ప్రతిపాదనలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

First Published:  17 Jun 2023 2:28 AM GMT
Next Story