Telugu Global
Telangana

శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు..!

దరఖాస్తులను పరిశీలించి, అర్హుల ఎంపిక పూర్తిచేయాలని చూస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని రేవంత్ సర్కారు ప్రణాళికలు రచిస్తోంది.

శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు..!
X

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు ఎప్పుడు?. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. 6 గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డు కంపల్సరీ. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు లేనివాళ్లు, ఈ మధ్యకాలంలో తమ నంబర్‌ గల్లంతయినవాళ్లు మొన్నటి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్‌ కార్డుల విషయంలో జనాల్లో ఆందోళన ఉన్న మాట వాస్తవం. ఇప్ప‌టి వ‌ర‌కు రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకే 6 గ్యారంటీలు అమలు చేస్తారా?. లేక కొత్తగా అప్లయ్ చేసుకున్నవాళ్లకు కూడా సంక్షేమ పథకాలు అందుతాయా? అనే సందేహాలు ఉన్నాయి. జనాల్లో ఉన్న భయాలు, ఆందోళనలను కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అర్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే సాధ్యమైనంత త్వరగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి ఆఖరులో లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్‌ రాకముందే కొత్త రేషన్‌ కార్డులిచ్చే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హుల ఎంపిక పూర్తిచేయాలని చూస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని రేవంత్ సర్కారు ప్రణాళికలు రచిస్తోంది.

ఇటీవల ప్రజా పాలనలో మొత్తం 1,25,84,383 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు, ధరణి ఇతర సమస్యలకు సంబంధించి 19,92,747 వచ్చాయి. ఇప్పటికీ దరఖాస్తులు సమర్పించలేని వాళ్లు కొందరు ఉన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డు కోసం ప్రత్యేకించి దరఖాస్తు చేసుకోని వాళ్లు ఉన్నట్లు సమాచారం. వీళ్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. దరఖాస్తు ఇవ్వాలనుకున్న వాళ్లు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారు. ఈ కార్యక్రమానికి చివరి గడువు అంటూ లేదని.. ఇది నిరంతర ప్రక్రియ అని కూడా స్పష్టం చేశారు.

First Published:  8 Jan 2024 9:06 AM GMT
Next Story