Telugu Global
Telangana

కేసీఆర్ చచ్చిన పాము.. వరంగల్‌ సభలో రేవంత్

వరంగల్‌ను అద్భుతమైన నగరంగా తీర్చి దిద్దుతామన్నారు రేవంత్ రెడ్డి. వరంగల్ పట్టణానికి అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు ఎయిర్‌పోర్టు కూడా నిర్మిస్తామన్నారు.

కేసీఆర్ చచ్చిన పాము.. వరంగల్‌ సభలో రేవంత్
X

కేసీఆర్ చచ్చిన పాముతో సమానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్‌లో ఆ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా నిర్వహించిన జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీకి రమ్మంటే రాకుండా కేసీఆర్ టీవీ చర్చల్లో పాల్గొంటున్నారని ఫైర్ అయ్యారు రేవంత్. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. అధికారం పోగానే కొందరు మామ, అల్లుడు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారంటూ సెటైర్లు వేశారు.

తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌కు అన్ని అర్హతలున్నాయన్నారు రేవంత్ రెడ్డి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు పదింటిలో కాంగ్రెస్‌ను గెలిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించాలని అభ్యర్థించారు. వరంగల్‌ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. వరంగల్‌కు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

వరంగల్‌ను అద్భుతమైన నగరంగా తీర్చి దిద్దుతామన్నారు రేవంత్ రెడ్డి. వరంగల్ పట్టణానికి అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు ఎయిర్‌పోర్టు కూడా నిర్మిస్తామన్నారు. వరంగల్‌ను పీడిస్తున్న చెత్త సమస్యకు ఇక్కడే కూర్చుండి పరిష్కారం చూపుతానన్నారు రేవంత్. ఇక రుణమాఫీ, ఆరు గ్యారెంటీలపై మాజీ మంత్రి హరీష్ చేసిన సవాల్‌పైనా స్పందించారు రేవంత్. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి చూపెడతానన్నారు. రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని హరీష్‌ రావు రెడీగా ఉండాలన్నారు రేవంత్.

First Published:  24 April 2024 3:31 PM GMT
Next Story