Telugu Global
Telangana

రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ని రద్దు చేస్తారా..?

సోనియా గాంధీ ఆశీర్వాదంతో సీఎం అయిన తనను ఎలా దించేయాలి, కాళ్లలో కట్టెపెట్టి ప్రభుత్వాన్ని ఎలా పడేయాలి అని ఆలోచించడం సరికాదన్నారు రేవంత్ రెడ్డి.

రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ని రద్దు చేస్తారా..?
X

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ రైతు రుణమాఫీ అంశం హాట్ టాపిక్ గా మారింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్.. ఇటీవల కొత్తగా ఆగస్ట్-15 డెడ్ లైన్ ప్రకటించింది. దీనిపై బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఆగస్ట్-15లోగా రుణమాఫీ చేయలేకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ ప్రశ్నకు బదులిచ్చారు రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ని రద్దు చేస్తారా..? అని ఎదురు ప్రశ్నించారు.

ఒట్టేసి చెబుతున్నా..

జోగులాంబ అమ్మవారి సాక్షిగా, సేవాలాల్‌ సాక్షిగా మాట ఇస్తున్నానని, ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులిస్తూ ఇబ్బందులకు గురిచేయవద్దని బ్యాంకర్లకు సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రైతులను ఇబ్బందిపెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఎందుకు లేటయ్యిందంటే..?

రుణమాఫీ లేట్ కావడానికి కారణం బీఆర్ఎస్ చేసిన అప్పులేనని అన్నారు రేవంత్ రెడ్డి. 2014లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే వడ్డీకే సరిపోయిందని, 2018లో మాఫీ చేస్తామని చెప్పి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టేనాటికి ఖజానా దివాలా తీసి.. ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. డిసెంబరు 7న సీఎంగా తాను బాధ్యతలు తీసుకునే రోజుకి రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్ ఉందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.26 వేల కోట్ల వడ్డీ చెల్లించామని వివరించారాయన. సోనియా గాంధీ ఆశీర్వాదంతో సీఎం అయిన తనను ఎలా దించేయాలి, కాళ్లలో కట్టెపెట్టి ప్రభుత్వాన్ని ఎలా పడేయాలి అని ఆలోచించడం సరికాదన్నారు రేవంత్ రెడ్డి. ఆరు నూరైనా రుణమాఫీ హామీ అమలు చేసి తీరతామన్నారు.

First Published:  24 April 2024 3:05 AM GMT
Next Story