Telugu Global
Telangana

రేపు రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం.. మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్ములూరులోని అర్బన్ పార్కులో హరితోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

రేపు రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం.. మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్
X

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం హరితోత్సవాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొక్కల పెంచాలనే లక్ష్యంతో 'హరిత హారం' పేరుతో ప్రభుత్వం 2015 నుంచి భారీ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రభుత్వ చిత్త శుద్ది కారణంగా రాష్ట్రంలో అడవుల శాతం మునుపటి కంటే పెరిగాయి. పచ్చదనం పెరగడంతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. అడవుల పెరుగుదల వల్ల జీవవైవిద్యం కూడా పెరుగుతోంది. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్ములూరులోని అర్బన్ పార్కులో హరితోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. 25 వేల ఎకరాల్లో 25 వేల మొక్కలను సోమవారమే నాటేందుకు అటవీశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే 40 రకాల మొక్కలను హరితోత్సవం నిర్వహించే ప్రదేశానికి తీసుకొని వచ్చారు. తుమ్ములూరు పార్కులో రాబోయే రోజుల్లో ఇతర మొక్కలను కూడా భారీగా పెంచుతామని తెలిపారు.

సీఎం కేసీఆర్ సోమవారం తుమ్ములూరు పార్కుకు వస్తుండటంతో మంత్రి సబిత ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ తీగల అనిత, కలెక్టర్ హరీశ్ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. పార్కులో ఎలాంటి మొక్కలు నాటుతున్నారో అడిగి తెలుసుకున్నారు. హరితోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న హరితోత్సవం ఏర్పాట్లపై అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆర్. ఎం. డోబ్రియల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం తుమ్ములూరులో సీఎం కేసీఆర్ హరితోత్సవం ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. సాయంత్రం రవీంద్ర భారతిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అలాగే.. హరిత హారంలో పచ్చదనం పెంపునకు కృషి చేసిన వారికి సన్మానం చేస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ హరిత హారంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 273 కోట్ల మొక్కలు నాటారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 14,864 నర్సరీలు ఏర్పాటు చేశారు. 19,472 పల్లె ప్రకృతి వనాలను 13,657 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు 2,011 బృహత్ ప్రకృతి వనాలను 6,298 ఎకరాల్లో విస్తరించారు. రాష్ట్రంలోని 1,00,691 కిలోమీటర్ల పొడవైన రహదారుల వెంట మొక్కలు నాటారు.

First Published:  18 Jun 2023 5:15 AM GMT
Next Story