Telugu Global
Telangana

ఆ ఇద్దరు మహనీయులు చిరస్మరణీయులు -కేసీఆర్

ఆ ఇద్దరు మహనీయులు చిరస్మరణీయులని, వారి ఆశయాలు, ఆకాంక్షలు, స్ఫూర్తితో తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని తెలిపారు సీఎం కేసీఆర్.

ఆ ఇద్దరు మహనీయులు చిరస్మరణీయులు -కేసీఆర్
X

ఒకరు తెలంగాణ స్వయంపాలన స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్. మరొకరు తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలను సాహిత్య రూపంలో తెలియజేసిన స్ఫూర్తి ప్రదాత గూడ అంజయ్య. వారిద్దరి వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు మహనీయులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు సీఎం కేసీఆర్. ఆ ఇద్దరు మహనీయులు చిరస్మరణీయులని, వారి ఆశయాలు, ఆకాంక్షలు, స్ఫూర్తితో తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వయంపాలనా స్వాప్నికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన కృషి అజరామరమైందన్నారు. జయశంకర్ ఆకాంక్షించిన మహోజ్వల తెలంగాణను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సమాజం ఆవిష్కరించుకుంటోందని చెప్పారు. ఇదే ఆయనకు ఘనమైన నివాళి అన్నారు. ఇలాంటి చారిత్రక సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ ఉండి ఉంటే ఎంతో సంతోషించే వారని, వారు లేకపోవడం బాధాకరమని చెప్పారు.


నేను రాను బిడ్డో.. అంటూ

తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు గూడ అంజయ్య గేయాలు, సాహిత్యం ప్రతీకలుగా నిలిచాయని చెప్పారు సీఎం కేసీఆర్. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య రంగ దుస్థితిని కళ్లకు కడుతూ 'నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు' అనే పాటను అంజయ్య రాశారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతి ఆ పాటకు సమాధానంగా నిలిచిందన్నారు. వైద్య, ఆరోగ్య రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహోన్నతంగా తీర్చిదిద్దుతున్న విధానం, అందుకు అనుగుణంగా ఆ రంగాన్ని ప్రజలు ఆదరిస్తున్న తీరు దీనికి నిదర్శనమని చెప్పారు. అమరుల ఆకాంక్షలను ప్రతిఫలిస్తూ, అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధిస్తూ, నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు కేసీఆర్.



First Published:  21 Jun 2023 11:49 AM GMT
Next Story