Telugu Global
Telangana

నచ్చకపోతే తీసుకోవద్దు.. బతుకమ్మ చీరల వెనుక కథ ఇదే - కేసీఆర్

బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా కొత్త బట్టలు కొనుక్కోలేని నిరుపేదలకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. దాంతో చేనేత పరిశ్రమకు రూ.300-400 కోట్ల విలువైన పని దొరుకుతుందన్నారు.

నచ్చకపోతే తీసుకోవద్దు.. బతుకమ్మ చీరల వెనుక కథ ఇదే - కేసీఆర్
X

బతుకమ్మ చీరల విషయంలో వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. మంగళవారం సిరిసిల్ల బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. బతుకమ్మ చీరల పంపిణీ వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. బతుకమ్మ చీరలు కేవలం చీరల పథకం కాదని.. చేనేత కార్మికుల కన్నీళ్లు తుడిచే మానవీయ పథకమని చెప్పుకొచ్చారు. కొంతమంది చిల్లరగాళ్లు ఉంటారని, వాళ్లు ఉన్నారని చిన్నబొవద్దని సూచించారు.

చేనేత కార్మికులకు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, అందులో భాగంగానే ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు కేసీఆర్. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా కొత్త బట్టలు కొనుక్కోలేని నిరుపేదలకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. దాంతో చేనేత పరిశ్రమకు రూ.300-400 కోట్ల విలువైన పని దొరుకుతుందన్నారు. కానీ, కొంతమంది దుర్మార్గులు ఆ చీరలు తీసుకెళ్లి కాల్చి.. విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చీర నచ్చకుంటే కట్టుకోవద్దన్నారు. పంపిణీ చేసిన చీరలు కట్టుకోవాలని ఎవరు బతిమాలట్లేదన్నారు. చేనేత కార్మికులను కాపాడుకునేందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. సోయి లేని ప్రతిపక్షాలు దుర్మార్గం చేస్తున్నాయని మండిప‌డ్డారు.


2017లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ టైంలో రూ.225 కోట్లు వెచ్చించి 94 లక్షల చీరలు పంపిణీ చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందుకోసం రూ. 400 కోట్లు ప్రతిపాదించి.. జూన్‌ 30న రూ.351 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది మొత్తం 21 రంగులు, 25 డిజైన్లతో 95 లక్షల 90 వేల 700 బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేశారు. అక్టోబర్ 4 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అయితే చీరలు నాణ్యతగా లేవంటూ వచ్చిన విమర్శలపై కేసీఆర్ సిరిసిల్ల సభలో కౌంటర్ ఇచ్చారు.

First Published:  18 Oct 2023 1:58 AM GMT
Next Story