Telugu Global
Telangana

నేత‌ల్లో గుబులు పుట్టిస్తున్న ఎన్నికల వివాదాల కేసులు

ఎన్నికల పిటిషన్లను 12 మంది న్యాయమూర్తులను విభజించటంతో కేసుల విచారణ కొంతకాలంగా వేగం పుంజుకుంది.

నేత‌ల్లో గుబులు పుట్టిస్తున్న ఎన్నికల వివాదాల కేసులు
X

కొత్తగూడెం MLA వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై హైకోర్టు తీర్పు, ప్రజాప్రతినిధుల్లో ఆందోళన రేపింది. ఇదే సమయంలో ఇతర నేతలకు చెందిన మరో 28 ఎన్నికల పిటిషన్లపై హైకోర్టులో విచారణ వేగం పుంజుకోవడంతో అటు నియోజకవర్గాల్లో ఉత్కంఠత, ఇటు నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికల పిటిషన్లను 12 మంది న్యాయమూర్తులను విభజించటంతో కేసుల విచారణ కొంతకాలంగా వేగం పుంజుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటుగా ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు, ఓ MLC ఎన్నికపై పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌, ఉప సభాపతి పద్మారావు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, దివాకర్ రావు, సతీశ్‌కుమార్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్‌, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపనేని నరేందర్, మాగంటి గోపీనాథ్, మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎంపీలు శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్, రంజిత్ రెడ్డిపై పిటిషన్ల విచారణ వివిధ దశల్లో ఉంది. వాటిలో ఎక్కువ పిటిషన్లు ఎన్నికల అఫిడవిట్లకి చెందిన వివాదాలే.

నిజానికి ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిర్వహణ నియమావళి ప్రకారం అభ్యర్థి తనతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు సమర్పించాలి. అయితే వీరు తమ ఆస్తులు, అప్పుల వివరాలను, తమపై ఉన్న క్రిమినల్ కేసులను తప్పుగా చూపారని ఆ కారణంగా వారి ఎన్నికను కొట్టివేయాలని ఆయా పిటిషన్లలో పేర్కొన్నారు. వీటిలో ఎక్కువ పిటిషన్లలో రెండో స్థానంలో ఉన్న సమీప ప్రత్యర్థులే పిటిషనర్లుగా ఉన్నారు.

ఇక కరీంనగర్ MLAగా గంగుల కమలాకర్‌ ఎన్నికపై బండి సంజయ్, పొన్నం ప్రభాకర్‌ విచారణకు ఇటీవల హాజరై వాంగ్మూలాలిచ్చారు. అలాగే మంత్రి కొప్పుల ఈశ్వర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ కేసులో EVMలు భద్రపరిచిన గది తాళం దొరకక పోవడంతో హైకోర్టు ఆదేశాల మేరకు స్ట్రాంగ్‌రూం తాళం పగలగొట్టి వివరాలు సమర్పించారు. అలాగే రాఘవేంద్రరాజు అనే వ్యక్తి తనపై వేసిన పిటిషన్‌ను తిరస్కరించాలన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. సోమవారం నుంచి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల వివాదంపై దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలన్న ఎంపీ బీబీ పాటిల్ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఇక మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై ఎన్నికేతరా కోర్టు కేసుల్లో విచారణ వేగంగా సాగుతోంది. YS రాజశేఖర రెడ్డి కేబినెట్‌లో గనుల శాఖ మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సబితా ఇంద్రారెడ్డిపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం, సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

OMC కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కోర్టు రోజువారీ విచారణ చేస్తోంది. ఇక చెన్నమనని రమేష్.. పౌరసత్వ వివాదంపై విచారణ హైకోర్టులో తుదిదశలో ఉంది. ఎన్నికల్లోపే ఈ వివాదంపై హైకోర్టు తీర్పు వెలుపడవచ్చునని న్యాయవాదుల అంచనా. అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తులు ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో ఎన్నికల పిటిషన్‌లు, కోర్టు కేసుల వివాదాలు నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

First Published:  30 July 2023 1:35 PM GMT
Next Story