Telugu Global
Telangana

ఫేక్ పోస్ట్... రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

రేవంత్ రెడ్డి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన సర్కులర్ ఫోర్జరీ అని తేలింది. అసలు సర్కులర్ ను బీఆర్ఎస్ బయటపెట్టింది.

ఫేక్ పోస్ట్... రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ హాస్టల్ చీఫ్ వార్డెన్ గతేడాది ఇచ్చిన సర్కులర్ ని ఎడిట్ చేసి, సీఎం రేవంత్ అసత్య ప్రచారం చేస్తున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్వీ నేతలు ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ సీఐకి కి తమ ఫిర్యాదుని అందించారు.

ఈసీకి కంప్లయింట్..

మరోవైపు ఎన్నికల కమిషన్ కి కూడా బీఆర్ఎస్ మరో ఫిర్యాదు చేసింది. ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్కులర్‌ను ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.


ఉస్మానియా యూనివర్శిటీలో కరెంటు, మంచినీటి సరఫరా సమస్యలు ఉన్నందున హాస్టల్ కి సెలవలు ఇస్తున్నట్టుగా ఇటీవల చీఫ్ వార్డెన్ ఓ సర్కులర్ జారీ చేశారు. ఆ సర్కులర్ ని తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో కరెంటు, నీటి సమస్యలు లేవంటూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. దానికి ఇదే సాక్ష్యం అంటూ ఉస్మానియా యూనివర్శిటీ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్కులర్ ని ఉదాహరణగా చూపించారు. దీనిపై వెంటనే రేవంత్ రెడ్డి స్పందించారు. గతేడాది కూడా ఇదే కారణంతో హాస్టల్ కి సెలవలు ఇచ్చారని, కేసీఆర్ హయాంలో కూడా ఇలానే జరిగిందని అన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన లేఖ ఫోర్జరీ అని తేలింది. అసలు లేఖను బీఆర్ఎస్ బయటపెట్టింది. అందులో సెలవలు ఇస్తున్నారని ఉంది కానీ, కరెంటు సమస్యను కారణంగా చెప్పలేదు. తప్పుడు లేఖలు సృష్టించడమే కాకుండా, కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీని కోరారు.

First Published:  1 May 2024 1:21 PM GMT
Next Story