Telugu Global
Telangana

దానంపై అనర్హత వేటు..! బీఆర్ఎస్ ప్రయత్నం ఫలించేనా..?

గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను ఎలా లాగేసుకుంటున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్.

దానంపై అనర్హత వేటు..! బీఆర్ఎస్ ప్రయత్నం ఫలించేనా..?
X

తెలంగాణలో బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టాయి. బీఆర్ఎస్ ఎంపీల్లో చాలామంది బీజేపీలోకి వెళ్లగా, ఎమ్మెల్యేలలో కొందరు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ అధిష్టానానికి టచ్ లోకి వెళ్లారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం ఏకంగా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

స్పందించని స్పీకర్..

అసెంబ్లీ స్పీకర్ ని కలసి దానంపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయన వారికి అందుబాటులోకి రాలేదు. ఆదివారం సాయంత్రం అపాయింట్ మెంట్ ఇచ్చినా కూడా స్పీకర్ రాకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు రెండున్నర గంటలసేపు వేచి చూశారు. ఫోన్ చేసినా కూడా ఆయన స్పందించలేదని వారు అంటున్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా కలవకపోవడం విచారకరం అన్నారు ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ తమను కలవలేదని వారు ఆరోపిస్తున్నారు.

గురివింద నీతి..

గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను ఎలా లాగేసుకుంటున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. తాము మాటలకు పరిమితం కామని, ఫిరాయింపు నేతలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికల ముందు ఎంపీలు వెళ్లిపోయినా బీఆర్ఎస్ పెద్దగా బాధపడలేదు కానీ, ఎమ్మెల్యేలు చేజారుతుండే సరికి అలర్ట్ అవుతోంది. వారిపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల ఏపీలో కూడా ఇలాంటి ఎపిసోడ్ జరిగింది. టీడీపీ, వైసీపీ.. ఇరు పార్టీల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆరోపణలు ఎప్పుడో వచ్చినా.. తీరా రాజ్యసభ ఎన్నికల టైమ్ లో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఏపీలో కలకలం రేగింది. మరి తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  18 March 2024 4:53 AM GMT
Next Story