Telugu Global
Telangana

గుర్తుల గుర్తుంచుకో రామక్క..

సంగారెడ్డి, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఈ రెండు గుర్తులు కారుతోపాటు ఈవీఎం మిషన్లో కనపడతాయి.నారాయణ్ ఖేడ్, ఆందోల్, దుబ్బాకలో స్వతంత్రులకు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో చపాతీ మేకర్ టెన్షన్ కు కారణం అవుతోంది.

గుర్తుల గుర్తుంచుకో రామక్క..
X

అధినాయకుడు ఎంతటి సమర్థుడైనా, ఆ పార్టీపై ప్రజల్లో ఎంత అభిమానం ఉన్నా.. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు అభ్యర్థులను టెన్షన్ పెడుతుంటాయి. ఈ ఎన్నికల్లో కూడా అధికార బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న కొంతమంది అభ్యర్థులను చపాతీ మేకర్, రోడ్డు రోలర్ గుర్తులు టెన్షన్లోకి నెట్టాయి. అయితే అన్ని జిల్లాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ సమస్యలేదు. స్వతంత్ర అభ్యర్థులకు ఆయా గుర్తులు ఈసీ కేటాయించిన నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులు హడావిడి పడుతున్నారు.

ఎక్కడెక్కడంటే..?

ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు రోడ్డు రోలర్, చపాతీ మేకర్ గుర్తులు కేటాయించింది ఈసీ. సంగారెడ్డి, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఈ రెండు గుర్తులు కారుతోపాటు ఈవీఎం మిషన్లో కనపడతాయి. ఓటర్లు పొరపాటున ఆయా గుర్తుల వైపు మొగ్గు చూపితే కొన్నిసార్లు జాతకాలే తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. నారాయణ్ ఖేడ్, ఆందోల్, దుబ్బాకలో స్వతంత్రులకు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో చపాతీ మేకర్ టెన్షన్ కు కారణం అవుతోంది.

ఈ రెండు గుర్తులపై గతంలో కూడా బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ ని ఆశ్రయించింది. ఈసారి ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టులో కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా నిర్ణయం రాలేదు. కారు, చపాతి మేకర్, రోడ్డు రోలర్ మధ్య ఉన్న తేడాను గుర్తించలేనంత అమాయకులు మన ఓటర్లు కాదు అని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈసీ ఆ రెండు గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించలేదు. ఇప్పుడు కారు గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను కొన్ని నియోజకవర్గాల్లో ఆ రెండు గుర్తులు టెన్షన్ పెడుతున్నాయి.

First Published:  29 Nov 2023 11:26 AM GMT
Next Story