Telugu Global
Telangana

మోదీ సభకు బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు దూరం.. ఎందుకంటే..?

ఇప్పటికే తెలంగాణ బీజేపీలో దళిత నేతలు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వంటి వారు పార్టీ మారారు. ఎస్సీ రిజర్వుడ్ సెగ్మెంట్లకు ఇన్ చార్జిగా దళిత నేతకు కాకుండా జితేందర్ రెడ్డిని పార్టీ నియమించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

మోదీ సభకు బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు దూరం.. ఎందుకంటే..?
X

ప్రధాని మోదీ ఇటీవలే హైదరాబాద్ లో బీసీ గర్జనకు వచ్చారు, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఇదివరకే బీజేపీ ఇచ్చిన హామీని ఆయన మరోసారి నొక్కి వక్కాణించారు. బీసీ కుల సంఘాలతో కూడా ఆయన సమావేశమయ్యారు. మళ్లీ ఇప్పుడు 'మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ'కు మోదీ హాజరు కాబోతున్నారు. రేపు(నవంబర్-11) పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సభ జరగబోతోంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో మోదీ కీలక నిర్ణయం ప్రకటిస్తారనే అంచనాలున్నా నేపథ్యంలో ఈ సభకు బీజేపీ ఎస్సీ మోర్చా దూరంగా ఉండాలని భావిస్తోంది. బీజేపీ దళిత నేతల్లోని ఎస్సీ వర్గం ఈ సభకు దూరం కాబోతోంది.

ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ సామాజిక వర్గం చాన్నాళ్లుగా పోరాటం చేస్తోంది. కానీ మాల సామాజిక వర్గానికి ఈ వర్గీకరణ ఇష్టం లేదు. గతంలో ఏపీ ప్రభుత్వం వర్గీకరణ కోసం ఇచ్చిన జీవోలను మాల మహానాడు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అక్కడితో ఆ వర్గీకరణ నిర్ణయం ఆగిపోయింది. బంతి కేంద్రం కోర్టులో పడింది. కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధమయ్యే అవకాశముంది. తెలంగాణ ఎన్నికల దృష్ట్యా.. కీలక రాజ్యాంగ సవరణకు ప్రధాని మోదీ ఆమోదం తెలుపుతారని అంటున్నారు. అంటే అది మాదిగలకు అనుకూల నిర్ణయం, అదే సమయంలో మాల సామాజిక వర్గానికి అది ఇష్టం లేదు. అందుకే వారు పార్టీలో ఉన్నా కూడా ప్రధాని మోదీ సభకు రాలేమంటున్నారు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతోంది. ఎస్సీ మోర్చా తెలంగాణ అధ్యక్షుడు కొప్పు బాష ఈ సమావేశానికి దూరంగా ఉంటామంటున్నారు. వికారాబాద్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన అసంతృప్తిగా ఉన్నారు. మాదిగల ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్ కి హాజరైతే.. మాల సామాజిక వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతుందని అందుకే తాము దూరంగా ఉంటామంటున్నారు.

దళిత నేతల అసంతృప్తి..

ఇప్పటికే తెలంగాణ బీజేపీలో దళిత నేతలు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వంటి వారు పార్టీ మారారు. ఎస్సీ రిజర్వుడ్ సెగ్మెంట్లకు ఇన్ చార్జిగా దళిత నేతకు కాకుండా జితేందర్ రెడ్డిని పార్టీ నియమించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు ప్రధాని మోదీ సభకు హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.


First Published:  10 Nov 2023 7:30 AM GMT
Next Story