Telugu Global
Telangana

బయటకొచ్చిన బండి.. తొలిసారి ఏం మాట్లాడారంటే..?

ఎంపీగా ఉన్న తనపట్ల పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉందన్నారు బండి సంజయ్. ఎవరో ప్రశ్నపత్రం పంపిస్తే నాకేం సంబంధం? అని ప్ర‌శ్నించారు.

బయటకొచ్చిన బండి.. తొలిసారి ఏం మాట్లాడారంటే..?
X

టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లి బెయిల్ పై బయటకొచ్చిన బండి సంజయ్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. అసలు హిందీ పేపర్ ని ఎవరైనా లీక్ చేస్తారా అని లాజిక్ తీశారు బండి. లీకేజీకి, కాపీయింగ్ కి తేడా తెలియదా అని ప్రశ్నించారాయన.

మధ్యలో TSPSC

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్.. TSPSC వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. TSPSC లీకేజీ కేసుని సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పరీక్షలు రద్దు కావడం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు రూ.లక్ష సాయం చేయాలన్నారు. జైళ్లు, లాఠీ దెబ్బలు తనకు కొత్త కాదని, యుద్ధానికి సిద్ధం అని అన్నారు.

ఎంపీగా ఉన్న తనపట్ల పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉందన్నారు బండి సంజయ్. ఎవరో ప్రశ్నపత్రం పంపిస్తే నాకేం సంబంధం? అని ప్ర‌శ్నించారు. సీపీ తన టోపీపై ఉన్న మూడు సింహాల ముద్రపై ప్రమాణం చేసి నిజం చెప్పాలన్నారు. నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్ట్ చేశారన్నారు బండి.

సెల్ ఫోన్ సంగతేంటి..?

బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా ఆయన సెల్ ఫోన్ మిస్ అయిందని, అది దొరికితే అసలు విషయాలు బయటపడతాయన్నారు పోలీసులు. కానీ, ఆ విషయంపై మాత్రం బండి నోరు తెరవలేదు. యధావిధిగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టి, జనంలో సింపతీ పెరిగిందా.. లేదా.. అని బేరీజు వేసుకుని ఇంటికెళ్లిపోయారు.

First Published:  7 April 2023 5:12 AM GMT
Next Story