Telugu Global
Telangana

రాజకీయాల్లోకి బండారు దత్తత్రేయ కూతురు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై!

బీజేపీ సీనియర్ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన వారసురాలిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు.

రాజకీయాల్లోకి బండారు దత్తత్రేయ కూతురు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై!
X

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ అభ్యర్థులను వెతికే పనిలో పడింది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా.. బీజేపీ తరపున బరిలోకి దిగడానికి పట్టుమని పాతిక మంది కూడా బలమైన అభ్యర్థులు దొరకడం లేదు. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే అని బీరాలు పలికిన బీజేపీ నాయకులు.. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. అయితే కనీసం చెప్పుకోదగిన సీట్లైనా గెలుచుకొని పరువు కాపాడుకునే ప్రయత్నంలో రాష్ట్ర బీజేపీ ఉన్నది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ స్థాయిలో పెట్టిన కొన్ని నిబంధనలు పక్కన పెట్టి మరీ.. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనే సంకేతాలు ఇస్తోంది.

సాధారణంగా బీజేపీలో జోడు పదవులు, వారసులకు టికెట్లు వంటి విషయాలకు కాస్త దూరంగా ఉంటారు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఇలాంటి నిబంధనలు ఏమీ పెట్టుకోనట్లే కనపడుతోంది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టింది. ఆయన జోడు పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తి కలిగిన వారసులకు కూడా టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. దీంతో బీజేపీ సీనియర్ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన వారసురాలిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు.

బండారు దత్తాత్రేయ వయో భారంతో ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారు. కానీ దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి మాత్రం బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అప్పట్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేయాలని విజయలక్ష్మి భావించారు. కానీ ఆ సీటును బీజేపీ సీనియర్ నాయకుడు, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన లక్ష్మణ్‌కే కేటాయించారు. అయితే ఆ ఎన్నికల్లో లక్ష్మణ్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం లక్ష్మణ్‌కు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చింది.

లక్ష్మణ్ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీగా ఉన్న ముషీరాబాద్ నుంచి విజయలక్ష్మి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి చాలా సార్లు పోటీ చేశారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. లక్ష్మణ్ ముషీరాబాద్‌నే ఎంచుకునే వారు. దీంతో విజయలక్ష్మి సనత్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఎంచుకొని అక్కడ రాజకీయం చేస్తున్నారు. గత ఎన్నికల సమయం నుంచే విజయలక్ష్మి సనత్ నగర్ పరిధిలో రాజకీయ కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ అనుచరగణాన్ని కూడా పెంచుకున్నారు. అయితే, లక్ష్మణ్ ఎంపీగా వెళ్లిపోవడంతో.. ముషీరాబాద్‌పై ఆమె ఆసక్తి చూపిస్తున్నారు.

ముషీరాబాద్ అయితే బీజేపీ ఓట్లు ఎక్కువగా ఉంటాయని.. పైగా ఆ ప్రాంతంలో తండ్రికి సన్నిహితులు, స్నేహితులు ఉండటం కలసి వస్తుందని విజయలక్ష్మి భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ టికెట్ కావాలని ఇప్పటికే బీజేపీ నాయకత్వాన్ని అడిగినట్లు తెలుస్తున్నది. ఒక వేళ కుదరక పోతే సనత్‌నగర్ నుంచి పోటీకి అయినా సిద్దమే అని చెప్పినట్లు సమాచారం.

First Published:  2 Aug 2023 5:38 AM GMT
Next Story