Telugu Global
Telangana

గద్దర్ పేరిట అవార్డు.. రేవంత్ ప్రకటనపై విమర్శలు

ఒకవేళ గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలనుకుంటే ప్రజాకవులు, జానపద కళాకారులు, సాహిత్యకారులకు ఇవ్వాలని సూచిస్తున్నారు. గద్దర్ ఆదర్శాలకు పూర్తిగా విరుద్ధంగా ఉండే సినిమారంగానికి ఆయన పేరిట అవార్డులు ఇవ్వడం సరికాదంటున్నారు.

గద్దర్ పేరిట అవార్డు.. రేవంత్ ప్రకటనపై విమర్శలు
X

ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరిట ఏటా అవార్డు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని రేవంత్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ప్రకటనపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినీ కళాకారులకు అవార్డులు ఇవ్వాలనుకుంటే ప్రభాకర్‌ రెడ్డి, సినారె, కాంతారావు లాంటి దిగ్గజాలు ఉన్నారని.. కానీ సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేని గద్దర్ పేరిట అవార్డు ప్రకటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక గద్దర్ అవార్డును అసలు సినీ పెద్దలు అంగీకరిస్తారా..? అనే మరో అనుమానాన్ని లేవనెత్తుతున్నారు. నంది అవార్డులను గద్దర్‌ అవార్డులతో రిప్లేస్‌ చేయడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలనుకుంటే ప్రజాకవులు, జానపద కళాకారులు, సాహిత్యకారులకు ఇవ్వాలని సూచిస్తున్నారు. గద్దర్ ఆదర్శాలకు పూర్తిగా విరుద్ధంగా ఉండే సినిమారంగానికి ఆయన పేరిట అవార్డులు ఇవ్వడం సరికాదంటున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రకటనపై పునరాలోచన చేయాలంటున్నారు.

ఇక రేవంత్ ప్రకటన చేసిన తీరును సైతం తప్పుపడుతున్నారు. కనీసం కేబినెట్‌ సహచరుల సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా రేవంత్ ప్రకటన చేశారని విమర్శిస్తున్నారు. ఇక తన మాటే జీవో, శాసనం అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి.

First Published:  2 Feb 2024 2:15 AM GMT
Next Story