Telugu Global
Telangana

ఎనీ డిగ్రీ టు ఎనీ పీజీ.. ఉస్మానియా మరో ముందడుగు..

కాంపిటీటివ్ ప్రపంచంలో ఎవరైనా ఏకోర్స్ అయినా చేసేందుకు అవకాశం కల్పిస్తోంది ఉస్మానియా యూనివర్శిటీ. డిగ్రీలో చదివిన సబ్జెక్ట్ తో సంబంధం లేకుండా పీజీలో ఏ సబ్జెక్ట్ అయినా ఎంపిక చేసుకోవచ్చు.

ఎనీ డిగ్రీ టు ఎనీ పీజీ.. ఉస్మానియా మరో ముందడుగు..
X

టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్ లు చదివే విద్యార్థులు, ఇంటర్ తర్వాత వేర్వేరు గ్రూపుల్లో చేరాల్సి ఉంటుంది. ఆర్ట్స్, సైన్స్ అక్కడే వేరవుతాయి. ఆ తర్వాత డిగ్రీ విషయంలో సైన్స్ వారికి ఆర్ట్స్ లో చేరే అవకాశమున్నా, ఆర్ట్స్ వారు సైన్స్ గ్రూపుల్లో చేరలేరు. ఇక పీజీ విషయానికొస్తే, డిగ్రీలో సంబంధిత సబ్జెక్ట్ చదవడం తప్పనిసరి. అంటే పూర్తిగా దారులు వేరైపోతాయనమాట. డిగ్రీలో ఆయా సబ్జెక్ట్ చదివి ఉంటేనే, అందులో స్పెషలైజేషన్ తో పీజీ పూర్తిచేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పేందుకు ఉస్మానియా యూనివర్శిటి ముందడుగు వేసింది.

కాంపిటీటివ్ ప్రపంచంలో ఎవరైనా ఏకోర్స్ అయినా చేసేందుకు అవకాశం కల్పిస్తోంది ఉస్మానియా యూనివర్శిటీ. డిగ్రీలో చదివిన సబ్జెక్ట్ తో సంబంధం లేకుండా పీజీలో ఏ సబ్జెక్ట్ అయినా ఎంపిక చేసుకోవచ్చు. డిగ్రీలో ప్యూర్ సైన్స్ చదివినవారు ఎంఏ పాలిటిక్స్ చదవొచ్చన్నమాట. అలాగే బీకాం, బీఏ చదివినవారు ఇకపై పీజీలో సైన్స్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. అయితే దీనికి ఆసక్తితోపాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించే సీపీగెట్ లో ర్యాంకు రావడం తప్పనిసరి. అంటే ఆయా సబ్జెక్టులపై కనీస అవగాహన ఉంటేనే పీజీ చేయడానికి అవకాశం ఉంటుంది.

ప్రయోగాత్మకంగా అమలు..

ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో ఏ గ్రూపు చదివినా, పీజీలో 6 కోర్సులు చేయొచ్చనే వెసులుబాటు ఇచ్చారు. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌, హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్ లో చేరేందుకు డిగ్రీలో గ్రూప్ తో సంబంధం లేదు. తాజాగా చేపట్టిన సీపీగెట్‌ ప్రవేశాల్లో రాష్ట్రంలోని 7 యూనివర్సిటీల్లోని పీజీ కాలేజీల్లో ఈ 6 ఎంఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. బీటెక్‌, బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు చదివినవారంతా పీజీలో ఈ 6 కోర్సులు ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానం సత్ఫలితాలిస్తే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎనీ డిగ్రీ టు ఎనీ పీజీ కూడా అమలు చేస్తామంటున్నారు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు. అంటే ఇకపై డిగ్రీలో ఫలానా సబ్జెక్ట్ చేశామని, పీజీ చేసే అవకాశం లేదని ఎవరూ ఇబ్బంది పడరు. డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్నా, సీపీగెట్ లో ర్యాంక్ తెచ్చుకుని, తమ అభిరుచికి తగ్గట్టు పీజీ చేయొచ్చు.

First Published:  26 Oct 2022 2:37 AM GMT
Next Story